తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న విబేధాలు బట్టబయలయ్యాయి. కలిసిమెలిసి పోతున్నట్లు నటిస్తున్న కొందరు సీనియరు నేతలు అవకాశం దొరికినప్పుడల్లా పీసీసీపై కత్తులు దూస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తరువాత అధికార పార్టీ తెరాస దెబ్బకు కుదేలైన కాంగ్రెస్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. ఇప్పటికైనా కలిసిమెలిసి పని చేసి అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసే దిశలో ముందుకు వెళ్లడం లేదు. పీసీసీ నిర్ణయాలను కొందరు సీనియర్లు తప్పుబడుతున్నారు.
సీనియర్ నేతల మధ్య విబేధాలు
ఇలాంటి పరిస్థితులే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య విబేధాలను రగిల్చేస్తున్నాయి. అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పీసీసీ... అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అంతా కూడా స్థానిక డీసీసీలకే అప్పగించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు... నామినేషన్లు దాఖలుకు తగినంత వ్యవధి లేకపోవటం వల్ల త్వరితగతిన పూర్తి చేసేందుకు అనువుగా పీసీసీ కార్యవర్గాన్ని, సీనియర్ నేతలను అన్ని రకాలుగా ఉపయోగించుకునే దిశలో పీసీసీ ముందుకు వెళ్లుతోంది.
సీనియర్లకు పుర ఎన్నికల బాధ్యతలు
ఎన్నికలు జరిగే ప్రతి మున్సిపాలిటీకి, నగరపాలక సంస్థకు పీసీసీ ఇన్‌ఛార్జిలను నియమించింది. అధికార పార్టీ వైఖరిని ఎండగట్టగలిగే సీనియర్లకు ప్రచారం నిర్వహించే బాధ్యతను అప్పగించింది. ఎన్నికలతో పెద్దగా సంబంధం లేని నేతలను ఇతర పనులు చక్కబెట్టేందుకు పురమాయించింది. సీనియార్టీతోపాటు ఆయా ప్రాంతాలపై పట్టున్న నాయకులను దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థల ఇన్ఛార్జిలుగా నియమించింది. ఎంపీలైన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డిలతో పాటు జానా రెడ్డి లాంటి సీనియరు నేతలకు వారి పరిధిలోని మున్సిపాలిటీల్లో...నగర పాలక సంస్థల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించుకునే బాధ్యతలను అప్పగించారు. ఇదే సమయంలో శుక్రవారం రోజున మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతురావులు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికలపై అవగాహన లేని వారిని కమిటీల్లో వేశారని, ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే కార్యక్రమంగా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.