తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రేటర్​ పీఠం లక్ష్యంగా కసరత్తు.. కలవరపెడుతున్న వలసలు - జీహెచ్​ఎంసీ ఎన్నికలు-2020

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అధిక సంఖ్యలో డివిజన్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. గత ఎన్నికల్లో రెండు డివిజన్లకే పరిమితమైన కాంగ్రెస్‌... పెద్దసంఖ్యలో గెలవాలనే సంకల్పంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. 45 మంది అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించగా... మిగిలినవారిని ఇవాళ ఎంపిక చేస్తామని పీసీసీ వెల్లడించింది. కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఎంపికపై... వలసలు తీవ్ర ప్రభావం చూపింది.

congress select candidates for ghmc elections
గ్రేటర్​ పీఠం లక్ష్యంగా కసరత్తు.. కలవరపెడుతున్న వలసలు

By

Published : Nov 19, 2020, 5:24 AM IST

గ్రేటర్‌లో అధిక స్థానాలను దక్కించుకునేందుకు వీలుగా కాంగ్రెస్‌ కార్యాచరణ రూపొందించుకుంటోంది. దుబ్బాక ఉపఎన్నిక ప్రభావం గ్రేటర్‌ పోరుపై పడుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు తోడు పార్టీ నుంచి మొదలైన వలసలతో... కాంగ్రెస్‌లో కుదుపులు చోటు చేసుకున్నాయి. అసంతృప్తితో పార్టీలో కొనసాగుతున్న నాయకులు... ఫిరాయింపులకు పాల్పడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలాకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌ గుడ్‌బై చెప్పారు. ఆ నియోజకవర్గ ఇంఛార్జ్​గా ఉన్న ఆయన కుమారుడు రవికుమార్‌ యాదవ్‌ రాజీనామా చేసి తప్పుకున్నారు. పార్టీ వీడుతున్నట్టు తెలిసిన వెంటనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు... బిక్షపతియాదవ్‌ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. అయినా బిక్షపతియాదవ్‌ నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ప్రయోజనం లేదని వెనుదిరిగారు. మరికొందరు కూడా వెళ్లే అవకాశం ఉండడం వల్ల... వారిని కూడా ప్రత్యక్షంగానో... పరోక్షంగానో బుజ్జగించే కార్యక్రమం కొనసాగుతోంది.

గ్రేటర్ అధ్యక్షుడి అలక

గ్రేటర్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌... అభ్యర్ధుల ఎంపికకు సంబంధించిన కమిటీల విషయంలో... తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని అలకబూనారు. తాను ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి కమిటీ వేసేటప్పుడైనా... తనను అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు... బుజ్జగించినట్లు తెలిసింది. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కమిటీలు వేసినట్టు... అందులో నిర్లక్ష్యం చేయాలన్న ఆలోచన లేదని వివరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇవాళ అన్నింటికీ ప్రకటన

నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనున్నందున... కాంగ్రెస్‌లో అభ్యర్ధుల ఎంపిక కష్టమైంది. బుధవారం ఆయా పార్లమెంటు నియోజకవర్గ కమిటీలు గాంధీభవన్‌లో సమావేశమై... అభ్యర్ధుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించాయి. 29 మందితో తొలి జాబితా, 16 మందితో రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం కలిసి 45 మంది అభ్యర్ధులను ఎంపిక చేసిన కాంగ్రెస్‌... మరో 105 మందిని ఇవాళ ఎంపిక చేసి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ వెల్లడించారు.

జిల్లాల నుంచి శ్రేణులు

అభ్యర్ధుల ఎంపిక తరువాత... ప్రచారంపై దృష్టిసారించాల్సి ఉన్నందున... అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్​లను నియమించే ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఇప్పటికే మల్కాజిగిరి పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్​లను నియమించిన పీసీసీ... మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఇవాళ ప్రకటించే అవకాశముంది. పోలింగ్‌ దగ్గరపడుతుండటంతో.. డివిజన్‌ ఇంఛార్జ్​లతోపాటు అసెంబ్లీ ఇంఛార్జ్​లను ఏర్పాటు చేసి... విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాల నుంచి చురుకైన నాయకులను రంగంలోకి దించుతోంది.

ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికలకు 16 మందితో కాంగ్రెస్​ రెండో జాబితా

ABOUT THE AUTHOR

...view details