అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ద్రవ్యవినిమయ బిల్లు సహా ఆరు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో రెండు తీర్మానాలను అసెంబ్లీ ఆమోదించింది. పట్టణప్రగతి, కరోనా అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. 48 గంటల 41 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.
ఒక్క పథకం ఆపలేదు..
ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు. ఆర్థిక మాంద్యంతో ప్రభుత్వ ఉద్యోగులకు కేరళలో ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేకపోతున్నారని.. కానీ తెలంగాణలో ఒక్క పథకం ఆపలేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. రెవెన్యూ వృద్ధి రేటులో 21.5 శాతంతో దేశంలోనే మొదటి స్థానం సాధించామని వెల్లడించారు.
ఐదేళ్లలో వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం రూ.2,72,926 కోట్లు ఇచ్చామని వివరించారు. కేంద్రం మాత్రం ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.1,12,854 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలను పెంచుతున్నామని... ఎంఎంటీఎస్ నిధులు కేటాయించి పనులు వేగవంతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పౌరసత్వాన్ని నిరూపించాకోవాల్సిన దుస్థితి..
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్‌లపై మేధావులు అభ్యంతరాలు చెప్పారని, మరి కొంత మంది నిరసన ప్రదర్శనలు చేశారని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్‌లో సీఏఏను తెరాస ఎంపీలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. 73 ఏళ్ల తరువాత పౌరసత్వం నిరూపించాకోవాల్సిన దుస్థితి రావడం దారుణమన్నారు. తెరాస, ఎంఐఎం మిత్రపక్షమైనా అన్ని విషయాలు వారితో ఏకీభవించడం లేదని తెలిపారు.