పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే కార్యాచరణ సిద్ధం చేసిన రేవంత్ రెడ్డి.. ప్రజాసమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెట్రో ధరల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిళ్లను, రిక్షాలను, ఎడ్లబండ్లను ఉపయోగించి నిరసన ప్రదర్శనలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఈ ఉదయం 11 గంటలకు నిర్మల్‌లో పెట్రోధరలపై నిరసన చేపట్టనున్నారు. ఆయా జిల్లాల్లోనూ ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగనున్నాయి.
యువతను ఆకర్షించేందుకు..
యువతను పార్టీకి దగ్గర చేసుకునేందుకు.. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులెన్ని? ఇప్పటి వరకు భర్తీ చేయకుండా ప్రభుత్వం నాన్చివేత ధోరణిపైనా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. తెరాస, భాజపాను ఎదుర్కొనేందుకు కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని హస్తం పార్టీ యోచిస్తోంది. మండల, నియోజకవర్గ స్థాయిలతో పాటు వివిధ విభాగాలకు చెందిన పార్టీ ప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించాలనుకుంటోంది. తదనంతరం స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం నినాదాలతో జిల్లాల పర్యటనకు కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లేలా.. ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న బడుగు బలహీన వర్గాలను దగ్గర చేసుకునేందుకు కార్యాచరణ రూపకల్పన జరుగుతోంది.