Congress Protest: రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు పోరుబాటపట్టాయి. ధరల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై మండిపడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రదర్శించాయి. హైదరాబాద్ అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హన్మంతురావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గ్యాస్ బండలతో శవయాత్ర నిర్వహించి.... నిరసన వ్యక్తం చేశారు. భాజపా, తెరాస పాలనతో ప్రజలకు వెనకటి రోజులొస్తున్నాయని వీహెచ్ విమర్శించారు.
"కేంద్ర ప్రభుత్వమేమో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే.. ఇటు రాష్ట్ర సర్కారు విద్యుత్ ఛార్జీలు పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. దాని ప్రభావం నిత్యావసర ధరలన్నింటిపై పడుతుంది. ఈ పరిణామాలన్ని చూస్తే.. మళ్లీ వెనకటి రోజులు వస్తాయనిపిస్తోంది. రెండు ప్రభుత్వాలు కలిసి.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారు." - వి.హన్మంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత
ఎల్బీనగర్‌లో..: ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్యాస్ బండకు పూలమాలవేసి.... కార్యకర్తలు గుండు గీయించుకుని ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. ఓ వైపు రైతుల బతుకులు రోడ్డున పడేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.... ధరలు పెంచి సామాన్య జనం నడ్డీ విరుస్తున్నాయని రాంరెడ్డి విమర్శించారు.
హన్మకొండలో..: ధరల పెంపును నిరసిస్తూ.... హన్మకొండలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. పార్టీ నేత నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి.... ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా గ్యాస్ బండలకు పూలదండలు వేసి... నిరసన వ్యక్తం చేశారు. వర్ధన్నపేటలో వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై కార్యకర్తలు గ్యాస్ సిలిండర్లతో బైఠాయించారు. సిరిసిల్ల గాంధీచౌక్‌లో గ్యాస్ సిలిండర్లతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు.