తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆపరేషన్ ఆకర్ష్‌.. తెరాస, భాజపాలపై కాంగ్రెస్‌ గురి - కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ అప్‌డేట్స్

congress operation aakarsh: కాంగ్రెస్ కౌంటర్ ఆపరేషన్ మొదలు పెట్టిందా..? గులాబీ గూటి నుంచి హస్తం వైపు చేయి చాచేందుకు ఆకర్ష్‌ ప్లాన్ వేసిందా..? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోందా..? ఆచితూచి ఆలోచిస్తూ వచ్చే ఎన్నికల్లో తన పావులు కదపబోతోందా..? వీటన్నింటికి సమాధానం అవును అనే అనిపిస్తోంది. ఎందుకంటే ఆపరేషన్ ఆకర్ష్‌తో తెరాస నుంచి కాంగ్రెస్‌ గూటికి చేరికలు మొదలయ్యాయి. పక్కా ప్లాన్‌తో అధికార పార్టీ నుంచి నాయకులను ఆకర్షిస్తోంది హస్తం. మంచిర్యాల జిల్లా నుంచి మొదలైన చేరికలు త్వరలో ఊపందుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఓ వైపు కారు కమలంలో గుబులు రేపుతుండగా.. మరోవైపు కాంగ్రెస్‌ కారుకు బ్రేక్ వేసేందుకు రెడీ అవుతోంది.

congress operation aakarsh
congress operation aakarsh

By

Published : May 23, 2022, 12:22 PM IST

congress operation aakarsh : ఏఐసీసీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనతో కాంగ్రెస్ నాయకుల్లో, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. ఆయన వచ్చి వెళ్లినప్పటి నుంచి హస్తం నేతల్లో ఊపు కనిపిస్తోంది. అధికార పార్టీని ఎదుర్కొని ముందుకెళ్లడమే లక్ష్యంగా నాయకులు పనిచేస్తున్నారు. గులాబీ, కమలం పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేయడం షురూ చేశారు. ఆపరేషన్ ఆకర్ష్‌ పేరిట హస్తం పార్టీలోకి ఆకర్షించేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్‌లు రచిస్తున్నారు. ఇంతకాలం తమ పార్టీలోని నాయకులను కాపాడుకోవడమే కష్టమవ్వగా.. ఇప్పుడు మాత్రం కాస్త జోష్‌ పెంచి ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానిస్తున్నారు.

కారుపై హస్తం గురి..ఏకంగా అధికార తెరాసపైనే రేవంత్ గురి పెట్టారు. నేతలు కారు దిగి హస్తం వైపు చేయిచాస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెరాస వ్యవస్థాపకుల్లో ఒకరైన, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు, సీఎం కేసీఆర్‌కు అత్యంత ప్రీతిపాత్రుడిగా పేరున్న నల్లాల ఓదెలు సతీసమేతంగా కారు దిగి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారి అనుచరులు కూడా హస్తం వైపు చేయి చేచారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

గోప్యంగా చేరికలు.. పీసీసీ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో అత్యంత రహస్యంగా మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ జడ్పీ ఛైర్మన్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ ఆపరేషన్‌ను అమలు చేశారు. గులాబీ, కమలం పార్టీలకు గుబులు రేపేలా .. కౌంటర్ ఆపరేషన్ మొదలు పెట్టారు. తెరాస నుంచి ఇద్దరు ముఖ్య నేతలు పార్టీలో చేరడంపై ఎవరికీ సమాచారం లేదు. వారు దిల్లీలో జన్‌పథ్‌కు చేరుకునే వరకు ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు.

తెరాసకు ఝలక్‌..అధికార పార్టీ జడ్పీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం అంటే .. తెరాసకు ఝలక్ ఇచ్చినట్టేనని చెప్పాలి. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మరికొందరు తెరాస, భాజపా సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ గూటికి రావడానికి ఆసక్తి చూపున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నుంచి అధికార పార్టీలో అసంతృప్తులు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెరాస, భాజపాలకు బలమైన నాయకత్వం ఉన్న ప్రాంతాల నుంచి వలసలు వస్తామంటే స్థానిక నాయకుల సమ్మతితో పార్టీలో చేర్చుకునే అవకాశాలను జానా రెడ్డి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి చేరడానికి ఓకే చెబుతుంది. నాయకత్వం లేని జిల్లాలు, నియోజక వర్గాల నుంచి చేరికలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పీసీసీ భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details