తెలంగాణ

telangana

ETV Bharat / city

హస్తానికి అభ్యర్థులు కరవయ్యారు.. - pcc on municipality elections

పురపాలక ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్​కు అభ్యర్థుల కొరత వచ్చింది. చాలా చోట్ల జనాదరణ కలిగిన నాయకులు చివర క్షణంలో పార్టీ కండువా మార్చడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నాయకత్వ లోపంతో బీ ఫారాల పంపిణీలోనూ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల పోటీకి అవసరమైన నిధులు సమకూర్చితే బరిలో నిలిచేందుకు అభ్యంతరం లేదని కొందరు తెగేసి చెబుతున్నారు.

congress
congress

By

Published : Jan 13, 2020, 11:04 PM IST

రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్​కు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. పోటీ అధికంగా ఉండి.. అభ్యర్థులను సర్దుబాటు చేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు నేతలు బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. చాలా చోట్ల మాత్రం అభ్యర్థులతో స్థానిక నాయకులు సతమతమవుతున్నారు.

చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు

గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం అంటూ... సెలక్ట్‌-ఎలక్ట్‌ పద్ధతిన అభ్యర్థుల ఎంపిక ఉండాలని డీసీసీలకు పీసీసీ గతంలోనే సూచించింది. ఆ తరువాత పీసీసీ నుంచి పరిశీలకులను, జిల్లా ఇంఛార్జీలను, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని ఇందులో భాగస్వామ్యం చేశారు. ఇలా చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. డీసీసీల మాటకు చెల్లుబాటు కాకుండా పోయింది. ఎవరికి వారు... తమదే ఆధిపత్యం అన్న కోణంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చొరవ తీసుకోవడంతో చాలా చోట్ల తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

జంపింగ్​లు మొదలు

చాలా జిల్లాల్లో వర్గాలు ఉండడం వల్ల... అభ్యర్థుల ఎంపిక సజావుగా సాగలేదు. పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ నుంచి ఆర్థికపరమైన హామీలు లేకపోవడం.. ఎవరి నాయకత్వంలో బరిలో నిలవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆశావహులంతా నామినేషన్లు వేసినప్పటికీ... బలమైన అభ్యర్థుల్లో ఎక్కువ భాగం తెరాసతో కుమ్మక్కై కాంగ్రెస్‌కు రాం రాం చెప్పినట్లు తెలుస్తోంది. మంగళవారం వరకు బీ ఫారాలు ఇచ్చేందుకు గడువు ఉండడం వల్ల... కప్పదాట్లు మొదలైనట్లు తెలుస్తోంది.

మాజీలదే హవా

బీ ఫారాల పంపిణీలోనూ కాంగ్రెస్​లో గొడవలు చోటు చేసుకున్నాయి. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో బీ-ఫారాల విషయంలో నాయకుల మధ్య విబేధాలు బయట పడ్డాయి. ప్రతి జిల్లాలోనూ బీ-ఫారాల పంపిణీ ఆయా డీసీసీలకు అప్పగించారు. అయినా కొన్ని జిల్లాల్లో మాజీ మంత్రులు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ కార్యర్శులు, ఇతర నాయకుల మధ్య బీ ఫారాల లొల్లి రెండు రోజులుగా కొనసాగుతోంది. ప్రధానంగా మాజీ మంత్రులు ఉన్న చోట్ల... డీసీసీలను లెక్క చేయడం లేదు. తామే అన్ని చూసుకుంటామని చెబుతున్నారు. ఇది చినికి చినికి గాలివానలా మారుతోంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు... బీ పారాలు దాఖలు చేసేందుకు సమయం ఉండగా... ఎవరు ఏ పార్టీ తరఫున బీ ఫారాలు ఇస్తారో వేచి చూడాలి.

ఇదీ చూడండి: ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details