తెలంగాణ

telangana

ETV Bharat / city

కాంగ్రెస్​లో కొత్త ఉత్సాహం.. ఏకతాటిగా దుబ్బాకలో ప్రచారం - దుబ్బాకలో ఏకతాటిగా కాంగ్రెస్ నేతల ప్రచారం

దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ విజయమే లక్ష్యంగా ప్రచారం హోరెత్తిస్తోంది. రాబోయే జీహెచ్​ఎంసీ, వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై... ఉప ఎన్నికల ఫలితం ప్రభావం పడుతుందని భావిస్తోంది. తెరాసను ఢీ కొట్టేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలతో కాంగ్రెస్ సిద్ధమైంది. ఎన్నడూ లేని విధంగా... రాష్ట్ర నాయకత్వమంతా ఏకతాటిపై దుబ్బాకలోనే మకాం వేయడం అనుకూలిస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు.

congress new strategy in dubbaka by election and full encouragment in party
కాంగ్రెస్​లో కొత్త ఉత్సాహం.. ఏకతాటిగా దుబ్బాకలో ప్రచారం

By

Published : Oct 13, 2020, 5:17 PM IST

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన స్థానాలను కైవసం చేసుకోలేకపోయిన కాంగ్రెస్​లో... రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​గా నియామకమైన మాణిక్కం ఠాగూర్​ శ్రేణుల్లో ఉత్సహం నింపగలిగారు. వరుస సమీక్షలతో పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్తుండడాన్ని చూసి... బలమైన నాయకుడు దొరికాడన్న సంతోషం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఎప్పుడూ... అంతర్గత విబేధాలతో సతమతమయ్యే రాష్ట్ర నాయకులు... మొదటిసారి వాటన్నింటిని పక్కన పెట్టి ఏకతాటిపై నడిపించడంలో మాణిక్కం సఫలీకృతులయ్యారని చెప్పొచ్చు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌... తెరాస స్థానాన్ని కైవసం చేసుకోవాలని సర్వశక్తులొడ్డుతోంది. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన తరువాతే... పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక నేతలతో నాలుగైదు సార్లు సమావేశమైన తరువాత... అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థి ఎంపికకు ముందే ప్రచారాన్ని డిజైన్‌ చేశారు.

ప్రచార వికేంద్రీకరణ..

ప్రతి గడపకు పార్టీ నేతలు వెళ్లి తీరాలన్న యోచనతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని 146 గ్రామాలు, ఎనిమిది మండలాల్లో... ప్రచారాన్ని వికేంద్రీకరించి గ్రామానికి ఒకరు చొప్పున ముఖ్యనాయకులను ఇంఛార్జ్​లుగా నియమించారు. ఈ నెల 7 నుంచి 12 వరకు నాయకులంతా దుబ్బాకలోనే మకాం వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ సిట్టింగ్‌ స్థానమైనందున... తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ జరిగిన అభివృద్ధి కంటే... అంతకు ముందు కాంగ్రెస్‌ పరిపాలనలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్న విషయాలను ఉదాహరణలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌, రైతు సమస్యలు, ఆస్తుల విలువ నిర్ధారించడం లాంటి కార్యక్రమాలతో పాటు తెరాస హామీల అమలు తదితర అంశాలను ప్రచారంలో విరివిగా వాడుతున్నట్టు కాంగ్రెస్‌ శ్రేణులు పేర్కొంటున్నాయి.

వ్యూహ.. ప్రతివ్యూహాలు

చెరుకు శ్రీనివాస్ రెడ్డి... నియోజకవర్గంతో అనుబంధం కలిగిన చెరుకు ముత్యంరెడ్డి తనయుడు కావడం... బలమైన అభ్యర్థిని బరిలో దించినట్లైంది. నియోజకవర్గ అభివృద్ధికి ముత్యంరెడ్డి చేసిన కృషిని కూడా... గడప గడపకు తీసుకెళ్లాలని మాణిక్కం ఠాగూర్​... పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఇలా వివిధ వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకెళ్లడం ద్వారా అధికార పార్టీని ఎండగట్టి ఓటర్లను కాంగ్రెస్‌ వైపు తిప్పుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులు ఏ విధంగా నష్టపోతారు... కార్పోరేట్‌ సంస్థలు ఎలా లబ్ధిపొందుతాయో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు... కాంగ్రెస్​పై చేస్తున్న విమర్శలను ఎక్కడిక్కడ తిప్పికొడుతూ... ప్రజల్లో విశ్వాసం పెంపొందించే దిశలో ముందుకెళ్తున్నారు.

సంప్రదాయానికి చెక్..

ఎప్పుడూ అంతర్గత కుమ్ములాటలతో సతమవుతూ... అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే కాంగ్రెస్ నాయకుల సంస్కృతికి మాణిక్కం మొదట్లోనే చెక్‌ పెట్టారు. ఎవరు కూడా పార్టీ నియమావళిని ఉల్లంఘించి మాట్లాడవద్దని... ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవద్దని స్పష్టం చేశారు. దీంతో దాదాపుగా అంతర్గత విమర్శలు, ప్రతివిమర్శలు ఆగిపోయాయి. దీనికి తోడు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​గా బాధ్యతలు తీసుకున్న తరువాత నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. పార్టీకి దూరంగా ఉంటున్న నాయకులనూ పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం చేయించారు. రాష్ట్ర నాయకత్వంపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేసే సీనియర్లు కూడా కలిసొచ్చేట్లు చేయగలిగారు.

కలిసికట్టుగా..

పార్టీ సీనియర్లు పొన్నాల లక్ష్మయ్య, హనుమంతురావు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ లాంటి నేతలు కూడా క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలతో పాటు దుబ్బాకలో అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు. ఫలితం ఏలా ఉంటుందో పక్కన పెడితే... ప్రయత్న లోపం ఉండకూడదని యోచిస్తున్నారు. అక్కడ గెలుపు సాధిస్తే అదే ఉత్సాహంతో... జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ నగరపాలక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ వచ్చినప్పటి నుంచి... పార్టీ కార్యకలాపాలు కూడా అనూహ్యంగా పెరిగాయని... ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేయకుండా అందరిని పార్టీని బలోపేతం చేయడంలో రాత్రి, పగలు కష్టపడుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:'భయపడేది లేదు... ప్రజల పక్షాన పోరాటంలో రాజీపడే ప్రసక్తేలేదు'

ABOUT THE AUTHOR

...view details