Telangana Congress MPs : గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీలో.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు కూడా ముందుకు రాలేని పరిస్థితులు ఎదుర్కొంది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి.. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగి విజయం సాధించారు. మరోవైపు కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు.
కాంగ్రెస్, భాజపాల్లో ఉత్సాహం..
Telangana Congress MPs Focus on Assembly Election : గత పార్లమెంటు ఎన్నికల్లో తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ మూడు, భాజపా నాలుగు లోకసభ స్థానాలను కైవసం చేసుకుని తెరాసపై పైచేయి సాధించాయి. తెరాసకు పార్లమెంటు ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగినట్లయ్యింది. ముఖ్యమంత్రి కుమార్తె కవితను బరిలో దింపినా కూడా.. నిజామాబాద్‌లో ఆమె ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నాటి పార్లమెంటు ఎన్నికల ఫలితాలు అటు భాజపా, ఇటు కాంగ్రెస్ పార్టీల్లో ఉత్సాహాన్ని నింపాయి.
ముగ్గురి విజయం..
Assembly Elections 2024 : కాంగ్రెస్ నుంచి విజయఢంకా మోగించిన ముగ్గురు ఎంపీలు కూడా హేమాహేమీలే. నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డిలు గెలుపొందారు. లోకసభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహం మార్చుకుని.. లోక్‌సభ బరిలో గట్టి పోటీనిచ్చే నాయకుల్ని దింపారు. క్షేత్ర స్థాయిలో ఆ ముగ్గురు పన్నిన రాజకీయ వ్యూహం ఫలించి.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించింది. వీరు ముగ్గురు కూడా పార్లమెంటు సమావేశాలకు కచ్చితంగా హాజరవుతూ.. అటు రాష్ట్ర సమస్యలు.. ఇటు విభజన హామీలపై లోక్‌సభలో గట్టిగానే తమ గళాన్ని వినిపిస్తున్నారు.
ట్రాక్ మార్చారు..
Congress MPs in Assembly Elections 2024 : అయితే ఇప్పుడు ఈ ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల రాజకీయ ఆలోచనలు మారుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సభ్యులుగా చురుకైన పాత్ర పోషిస్తున్నా .. వారి ధ్యాసంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ముగ్గురు పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే సిద్దమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, నల్గొండ నుంచి వెంకట్ రెడ్డి, హుజూర్నగర్ నుంచి ఉత్తమకుమార్ రెడ్డి పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల కొడంగల్‌లో పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన మనసులో మాటను చెప్పకనే చెప్పారు.
మొత్తం మీద కాంగ్రెస్.. పార్టీల్లో కీలక నేతల చూపంతా శాసనసభ చుట్టే తిరుగుతోంది. పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వచ్చిన తర్వాత.. వీరు అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కానున్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ శ్రేణుల్లో విస్త్రృతంగా చర్చలు కొనసాగుతున్నాయి.