రైతుల ఆత్మహత్యల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రైతుల ఆత్మహత్యలు, అన్నదాతల కష్టనష్టాలపై లేఖలో వివరించారు. దాదాపు 12 గంటలపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో 5నిమిషాలైనా రైతుల గురించి చర్చించడానికి సమయం దొరకలేదా అన్ని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై కనీస ప్రస్తావన చేయలేని సీఎం వైఖరిపై రైతుల తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
కేసీఆర్ చెప్పేవన్నీ బూటకమే!
రైతుల సమస్యలపై చర్చ జరిగితే రుణమాఫీ, రైతుబంధు మద్దతు ధర అమల్లో ఉన్న లోపాలు వెలుగులోకి వస్తాయని... సమీక్ష చేయలేదని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. నేషనల్ క్రైం బ్యూరో రికార్డు తాజా లెక్కల ప్రకారం అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయన్నారు. గడిచిన ఆరేళ్లలో తెలంగాణలో 5,912 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఈ అధికారిక లెక్కలను చూస్తుంటే రైతుల విషయాల్లో సీఎం చెప్పేవన్నీ బూటకమేనని తెలిపారు.