Mallu Ravi Fire on Komatireddy Rajagopal Reddy: ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయటంపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిందని తెలిపారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ మూడేళ్లుగా భాజపా బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడని ధ్వజమెత్తారు. ఆయన మాటలకు కాంగ్రెస్ శ్రేణులు సమాధానం చెబుతాయని మల్లు రవి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలు, నిరుద్యోగ జంగ్ సైరన్లు చేశారని.. వరంగల్ రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ వచ్చారని మల్లు రవి వివరించారు. త్వరలో సిరిసిల్లలో యూత్ డిక్లరేషన్ విడుదల చేయాలని చూస్తున్నామని మల్లురవి వెల్లడించారు. ఇందిరాగాంధీ హయాంలో జనతా పార్టీలో చేరిన వారంతా శంకరగిరి మాన్యాల్లో కలిసి పోయారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వదిలిపెట్టి భాజపాలోకి వెళ్తున్న వారికి కూడా అదే గతి పడుతుందని మల్లురవి జోస్యం చెప్పారు.