Congress Protests: రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తన పోరాటాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని దీక్షలు చేస్తున్న కాంగ్రెస్.... హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసనలు చేసేందుకు సిద్ధమైంది. అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని తేల్చి చెబుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు... వచ్చే నెల 3న మోదీ, అమిత్‌షా వస్తున్నందున నిరసన ప్రదర్శనలు చేయాలని ఇప్పటికే పీసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే మోదీ హైదరాబాద్ పర్యటనపై తెరాస తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తోంది.
అగ్నిపథ్‌పై తెరాస తన వైఖరిని స్పష్టం చేయనట్లయితే... తెరాస, భాజపాల మధ్య అనైతిక బంధం ఉందని భావించాల్సి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో ఇంతకాలం తెరాస... భాజపాల మధ్య బంధం ఉందని... ప్రధాని మోదీ ఆడించినట్లే సీఎం కేసీఆర్ ఆడుతున్నారని కాంగ్రెస్ చేస్తున్నతీవ్ర ఆరోపణలకు కూడా సమాధానం వస్తుందని భావిస్తున్నారు. కేంద్రం తెచ్చిన ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.