తెలంగాణ

telangana

ETV Bharat / city

మినీ పుర ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్​ఈసీకి షబ్బీర్​ అలీ లేఖ - telangana varthalu

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మినీ పుర ఎన్నికలను వాయిదా వేయాలని మాజీ మంత్రి షబ్బీర్​ అలీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల కార్యక్రమాల ద్వారా కొవిడ్​ మరింత విస్తరించే అవకాశం ఉందని... దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల షెడ్యూల్​ను వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

congress leader Shabbir Ali letter to SEC
మినీ పుర ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్​ఈసీకి షబ్బీర్​ అలీ లేఖ

By

Published : Apr 18, 2021, 7:18 PM IST

రాష్ట్రంలో మినీ పుర ఎన్నికలను వాయిదా వేయాలని మాజీ మంత్రి షబ్బీర్​ అలీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తెలంగాణలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా తీరును వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారధికి ఆయన లేఖ రాశారు. కొవిడ్​ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేయడాన్ని, ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేయడాన్ని కూడా గుర్తు చేశారు. కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉండటంతో చారిత్రాత్మక కుంభమేళాతోపాటు అనేక జాతీయ కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. రెండు నగరపాలక సంస్థలు, అయిదు పురపాలక సంఘాలతోపాటు ఇతర ఉప ఎన్నికల దృష్ట్యా....రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతాయన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా లక్షణాలు పైకి కనిపించని కొవిడ్‌ రోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని... తద్వారా కరోనా మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు.

ఈ నెల 16వ తేదీన 4,446 పాజిటివ్‌ కేసులు నమోదై 12 మరణాలు సంభవించాయని తెలిపారు. ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు 22,240 కేసులు నమోదుకాగా... 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 68శాతం కరోనా కేసులు పెరిగాయన్నారు. ఎన్నికలు జరిగే వరంగల్‌ అర్బన్‌లో 47శాతం, గ్రామీణంలో 215శాతం, ఖమ్మంలో 124శాతం, నాగర్‌ కర్నూల్‌, సిద్దిపేట 105 శాతం, నల్గొండ 88శాతం, మహబూబ్‌నగర్‌ 76శాతం, రంగారెడ్డి 73శాతం లెక్కన కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగినట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో 11.26లక్షల మంది ఓటర్లు, 9వేల మంది ఎన్నికల సిబ్బందితోపాటు వేలాది మంది భద్రతా సిబ్బంది భాగస్వామ్యులు కావాల్సి ఉంటుందని తద్వారా కొవిడ్‌ మరింత విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:కరోనా నుంచి చంటి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోండి!

ABOUT THE AUTHOR

...view details