తెలంగాణ, ఆంధ్ర తిరిగి విలీనం అవుతాయని కొందరు... అడ్డుకుంటామని మరికొందరు రాజకీయ స్వార్థపరులు ప్రకటనలు చేస్తూ.. రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఆరోపించారు. అలాంటి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం క్షమించరని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని కొందరు.. రాజకీయ దురుద్దేశంతో అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు కలిసేందుకు కుట్ర జరుగుతోందని.. జనాల్లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అలా మాట్లాడటం క్షమించరాని నేరం..
"60 దశాబ్దాల పోరాటంతో, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణను తిరిగి విలీనం చేసే సాహసం కేసీఆర్‌తో సహా ఎవరూ చేయలేరు. ఒక వేళ చేసినా.. బతికి బట్ట కట్ట లేరు. తెలంగాణ రావడం ఆలస్యమవుతుందని.. నిరాశ నిస్పృహలతో జీవితాలను బలి చేసుకున్న అమర వీరుల త్యాగాలను మరిచి.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేసే వ్యాఖ్యలు సహించరానివి. రెండు రాష్ట్రాలుగా విడగొట్టకుండా సమైక్యంగా ఉంచాలని చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాతనే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేశారు. ఈ విషయంలో అనవసర అపోహలు కల్పించడం క్షమించరాని నేరం. ప్రజలు కోరుకున్నట్లు పరిపాలన సాగకుంటే.. ఆకాంక్షలు నెరవేరకుంటే సరిదిద్దుకునే సత్తా తెలంగాణ ప్రజలకు ఉంది." -నిరంజన్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు
సంబంధిత కథనాలు..