కులాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్రెడ్డి ఖండించారు. రేవంత్ వ్యాఖ్యలను విభేదించిన మహేశ్వర్రెడ్డి.. రేవంత్ మాట్లాడింది వ్యక్తిగతమని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఆయన కర్ణాటకలో మాట్లాడింది వక్రీకరించవద్దని కోరారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. బడుగు బలహీనవర్గాల కోసమే కాంగ్రెస్ ఆలోచన చేస్తుందన్నారు. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"కులాలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తున్నా. రెడ్లకు, వెలమలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. చొక్కారావు లాంటి నేతలు కాంగ్రెస్ కోసం ఎంతో కష్టపడ్డారు. కాంగ్రెస్ అన్ని వర్గాలకు.. అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తుంది. అన్ని కులాల వారు కాంగ్రెస్‌లో అగ్రస్థానాలు అధిరోహించారు. సామజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం. రేవంత్‌రెడ్డి మాట్లాడింది.. వ్యక్తిగతంగా భావిస్తున్నాం. నిన్న మొన్న వచ్చిన వారికి కాంగ్రెస్ గురించి తెలియదు." -ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్