సిద్దిపేట కలెక్టర్‌గా ఉంటూ రాజీనామా చేసి, తెరాస తరఫున ఎమ్మెల్సీ(trs mlc candidates 2021)గా నామినేషన్ దాఖలు చేసిన వెంకట్రామిరెడ్డి(venkatram reddy ias)పై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. గ్రూపు-1 అధికారిగా సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు వెంకట్రామిరెడ్డి వ్యవహారశైలిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు పదవులు అనుభవించిన వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రులకు దగ్గరగా ఉంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి కోకాపేట భూముల వేలంలో వెంకట్రామిరెడ్డి తన కుటుంబానికి చెందిన రాజ్ పుష్ప సంస్థకు భూములు దక్కించుకున్నట్లు ఆరోపించారు.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
"దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనూ వెంకట్రామిరెడ్డి తెరాసకు సహకరించారు. అదే విషయం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం వల్ల ఆయనను పక్కన పెట్టారు. భూసేకరణ విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులపై దాడి చేయించారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని, వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తే పక్కన పడేశారు. రాష్ట్రపతికి, డీవోపీటికి ఫిర్యాదు చేయగా.. చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. వెంకట్రామిరెడ్డిని ఆఘమేఘాలపై ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ పదవి ఏలా ఇస్తారు. ప్రతి ఏటా తన ఆస్తుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాల్సి ఉండగా ఎక్కడా వెల్లడించలేదు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించేందుకు వీల్లేదు. ఆయన ఎమ్మెల్సీ నామినేషన్ తిరస్కరించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" - రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదు..
మాజీ ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి అవినీతి ఆరోపణలపై మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కలిసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నారు. అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు లాంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలని కోరనున్నారు.