తెలంగాణ

telangana

ETV Bharat / city

'క్రికెట్​ టీంలా పనిచేద్దాం... సచివాలయంపై జెండా ఎగరేద్దాం' - సచిన్​, ధోని లాంటి నాయకులున్నారు...

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్​ నేతృత్వంలో జూమ్‌ ఆప్‌ ద్వారా జరిగిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా 3 గంటలపాటు సాగిన సమావేశంలో నాయకులకు మానిక్కం పలు కీలక సూచనలు చేశారు. నాయకులంతా క్రికెట్​ టీం లాగా కలిసికట్టుగా పని చేస్తే విజయం తథ్యమని ఉత్సాహం నింపారు.

'క్రికెట్​ టీంలా పనిచేద్దాం... సచివాలయంపై జెండా ఎగరేద్దాం'
'క్రికెట్​ టీంలా పనిచేద్దాం... సచివాలయంపై జెండా ఎగరేద్దాం'

By

Published : Sep 16, 2020, 6:09 PM IST

క్రికెట్ టీం లాగా కలిసికట్టుగా పనిచేస్తే 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సులువుగా సాధించొచ్చని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్​ అభిప్రాయపడ్డారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అందరం కలిసికట్టుగా పని చేయాలని నాయకులకు సూచించారు. మానిక్కం ఠాగూర్‌ నేతృత్వంలో జూమ్‌ ఆప్‌ ద్వారా జరిగిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎం.పీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సచిన్​, ధోని లాంటి నాయకులున్నారు...

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటలపాటు కొర్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా మానిక్కం ఠాగూర్ నియామకం అయ్యాక ఇది మొదటి సమావేశం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్ కమిటీ సభ్యులను మానిక్కం ఠాగూర్‌కు పరిచయం చేశారు. క్రికెట్​లో సచిన్ టెండూల్కర్, ధోనీలాగా తెలంగాణలో కూడా గట్టి నాయకులు ఉన్నట్లు తెలిపారు. క్రికెట్‌లో ఒక్కరో, ఇద్దరో కష్టపడితే గెలవడం కష్టం... అదే టీం అంతా కలిసి కట్టుగా కష్టపడితే గెలువగలమన్నారు.

సోనియా గాంధీకి బహుమతిగా...

ప్రతి ఒక్కరు 2023 ఎన్నికలను ఛాలెంజ్​గా తీసుకొని పనిచేసి గెలవాలని.. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చినా సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని నాయకులకు సూచించారు. మానిక్కం ఠాగూర్‌ పార్టీలో కింది స్థాయి నుంచి పార్టీలో సంస్థాగతంగా పని చేశారని... ఎన్ఎస్​యూఐ, యూత్ కాంగ్రెస్‌లో కూడా పనిచేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యత్వం, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికలపై ఈ సమావేశంలో పార్టీ నాయకులతో మానిక్కం ఠాగూర్​ అడిగి తెలుసుకున్నారు.

ఎల్ఆర్ఎస్ జీవో, నాగులు ఆత్మహత్యే అస్త్రాలు...

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28 వరకు నడుస్తాయని చెప్పి... కరోనా పేరుతో ఇవాళనే ముగిస్తున్నట్లు స్పీకర్ చెప్పారని కోర్‌ కమిటీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో జరగబోవు దుబ్బాక ఉప ఎన్నికతోపాటు మూడు కార్పొరేషన్, రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఛాలెంజ్‌గా తీసుకొని పని చేయాలని సూచించారు. మనిక్కం ఠాగూర్ నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికలలో విజయం సాధిద్దామని ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్ జీవో, ఆత్మహత్య చేసుకున్న నాగులు విషయాల్లో ఉద్యమాలు చేసుకుంటూ ముందుకెళ్లదామని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సచివాలయంపైన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు ఠాగూర్​ సూచించారు.

ఇదీ చూండడి: 'అసెంబ్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేద్దాం'

ABOUT THE AUTHOR

...view details