తెలంగాణ

telangana

ETV Bharat / city

అస్తవ్యస్తంగా హస్తం పార్టీ.. పూర్తి కాని అభ్యర్థుల ఎంపిక - ghmc elections-2020

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస, భాజపాలు ప్రచార జోరు చూపిస్తుంటే.... కాంగ్రెస్‌ పార్టీ మాత్రం నిదానంగా సాగుతోంది. వ్యూహాలకు పదును పెడుతున్నట్లు చెబుతున్నా... క్షేత్ర స్థాయిలో పార్టీ ప్రచారాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇన్‌ఛార్జీలు, సమన్వయకర్తల నియామకాలకే పార్టీ నాయకత్వం పరిమితమైంది. దుబ్బాక ఉపఎన్నికపై చూపిన శ్రద్ధలో సగం కూడా గ్రేటర్‌ ఎన్నికలపై చూపడం లేదన్న విమర్శలు కాంగ్రెస్‌ వర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి.

congress back step in ghmc elections campaining
అస్తవ్యస్తంగా హస్తం పార్టీ.. ఇంకా పూర్తి కాని అభ్యర్థుల ఎంపిక

By

Published : Nov 22, 2020, 5:30 AM IST

రాష్ట్రంలో అధికార తెరాసకు ప్రత్యామ్నాయం తామంటే... తామంటూ ప్రకటనలు చేయడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపాలు తీవ్ర పోటీ పడుతున్నాయి. కానీ కాంగ్రెస్‌ మాత్రం ఆ దూకుడును క్షేత్రస్థాయిలో చూపించలేకపోతోంది. ప్రతిష్టాత్మకమైన జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడంలో... హస్తం పార్టీ తీవ్ర జాప్యం చేస్తోంది. దుబ్బాకలో సర్వశక్తులు ఒడ్డిన పార్టీ... గ్రేటర్‌ ఎన్నికల్లో మాత్రం జోరు చూపలేకపోతోంది.

పట్టించుకోని నాయకత్వం!

జీహెచ్​ఎంసీ పోరును కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్‌ పట్టించుకోవడం లేదన్న భావన, అంతర్గత విమర్శలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సైతం అభ్యర్థుల ఎంపికలో శ్రద్ధ కనబరచలేదన్న విమర్శలు వస్తున్నాయి. కమిటీల ఏర్పాటు, సమన్వయకర్తల నియామకంలోనూ నాయకులతో చర్చించకుండానే... కార్యకలాపాలను అప్పగించడం ఏమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వెళ్లలేమని తెగేసి చెప్పినా... ఫోన్‌ ద్వారా పీసీసీ చీఫ్‌ బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.

కంగుతిన్న కమిటీ

అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఏలాంటి పాత్ర లేనప్పుడు ఆ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఎందుకు నియమించాలని కొందరు నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఓ పార్లమెంటు నియోజకవర్గంలో... ప్రత్యేక కమిటీ సమావేశంలో... అప్పటికే నిర్ణయించుకున్న అభ్యర్థుల పేర్లను ముందుంచడంతో ఆ కమిటీ కంగుతినాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్ధుల ఎంపిక విషయంలోనూ తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికీ 34 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితి కాంగ్రెస్‌లో నెలకొందని శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

పూర్తి కాని అభ్యర్థుల ప్రకటన

మల్కాజిగిరి, మెదక్‌, హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లోని అన్ని డివిజన్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రకటించగా... చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో రెండు డివిజన్లకు, సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా 32 డివిజన్లకు మొత్తం 34 డివిజన్లకు అభ్యర్థులను ఇప్పటికీ వెల్లడించలేదు. ఆ 34 డివిజన్లల్లో ఒక్కో చోట ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి 32 మందితో ఓ జాబితా విడుదల చేసింది. నామినేషన్లు వేసిన వారిలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలిగిన వారికి మాత్రమే బీ-ఫాం ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. అభ్యర్థులకు నేరుగా బీ-ఫాంలు ఇవ్వాలని మొదట యోచించిన కాంగ్రెస్‌... పంథా మార్చుకుని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు అందజేసింది.

ఇదీ చూడండి:32 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ మరో జాబితా

ABOUT THE AUTHOR

...view details