రాష్ట్రంలో దళిత బంధు పేరున ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పోరుబాట పట్టింది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చని తెరాస ఇప్పుడు దళిత బంధు పేరున కపట నాటకానికి తెరతీసిందని విమర్శలు చేస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో లబ్దిపొందేందుకు దళిత బంధును తెచ్చిందన్నారు. కాంగ్రెస్ ఆ పథకానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే.. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది.
క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి నుంచి శ్రీకారం చుట్టిన హస్తం పార్టీ... రావిర్యాలలో రెండో సభ నిర్వహించింది. ఈ రెండు సభలకు అంచనాలకు మించి జనం తరలివచ్చి విజయవంతం అయ్యారని భావిస్తున్న కాంగ్రెస్... మూడో సభకు సిద్దమవుతోంది. గజ్వేల్‌లో మూడో సభ ఏర్పాటు చేయాలని మొదట భావించినా... తక్కువ సమయం ఉండడం వల్ల కుదరదనుకున్న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ముఖ్య నాయకుల సమావేశం 48 గంటల దీక్షకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఈ దీక్ష కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో జరగాలని నిర్ణయించింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే సీఎం దత్తత తీసుకున్న గ్రామంలో రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు దళిత గిరిజన దీక్షకు ఎంచుకున్నారు. రెండు రోజులపాటు అక్కడ దీక్షకు దిగడం వల్ల.... మూడు చింతలపల్లిలో ఏలాంటి అభివృద్ధి జరగలేదని ప్రపంచానికి చూపించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామాల్లోనే అభివృద్ధి లేదంటే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్న కోణంలో విమర్శలకు పదును పెట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో దుస్థితిని ప్రజల దృష్టికి తెచ్చేందుకు కూడా ఈ మూడు చింతలపల్లిని వేదికగా చేసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.