తెలంగాణ

telangana

ETV Bharat / city

మారిన ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు - బీబీఏ పరీక్షల్లో గందరంగోళం వార్తలు

వాళ్లు బీబీఏ విద్యార్థులు. సెమిస్టర్ పరీక్షకు వెళ్లారు. ఇన్విజిలెటర్లు ప్రశ్నాపత్రాలు ఇచ్చారు. చదివిన ఒక్క ప్రశ్నా రాలేదు. అసలు అది వాళ్ల సిలబస్​ కాదు! ఏంటా అని చూస్తే బీకాం సబ్జెక్ట్. అధికారుల నిర్లక్ష్యం వల్ల అదే ప్రశ్నాపత్రానికి జవాబులు రాశారు.

పరీక్ష కేంద్రంలో మారిన ప్రశ్నపత్రం..ఆందోళనలో విద్యార్థులు

By

Published : Nov 3, 2019, 1:03 PM IST

Updated : Nov 3, 2019, 1:17 PM IST

పరీక్ష కేంద్రంలో ఒక ప్రశ్నపత్రానికి బదులుగా మరొకటి రావడం చూసి.. విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం వేగవరంలోని గీతాంజలి కళాశాలకు చెందిన సుమారు 20 మంది బీబీఏ కోర్సు విద్యార్థులకు... ఐదో సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు ఏలూరు సీఆర్‌ఆర్‌ మహిళా కళాశాలను కేంద్రంగా కేటాయించారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షలో బీబీఏ విద్యార్థులకు బీకాం ప్రశ్నపత్రాన్ని ఇన్విజిలేటర్లు అందజేశారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన పొరపాటును గుర్తించి.. ఒకసారి ప్రశ్నపత్రాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని మార్చడం వీలు కాదన్నారు. తప్పిదాన్ని నన్నయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చేసేదిలేక.. విద్యార్థులు పరీక్ష రాసి ఇళ్లకు వెళ్లిపోయారు.

ఈ విషయమై వారు తమ తల్లిదండ్రులతో కలసి శనివారం సీఆర్‌ఆర్‌ మహిళా కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. ప్రశ్నపత్రం మారిన విషయమై విశ్వవిద్యాలయానికి తెలియజేస్తామంటూ లేఖ రాసి తమకు ఇవ్వాలని కళాశాల వద్ద ఆందోళన చేశారు. విశ్వవిద్యాలయానికి తాము ఈ-మెయిల్‌ పంపామని.. లేఖ రాసి ఇవ్వడం వీలుకాదని కళాశాల యాజమాన్యం చెప్పడంపై వాగ్వాదం జరిగింది. పరిస్థితి తెలుసుకున్న సీఆర్‌ఆర్‌ విద్యాసంస్థల ప్రతినిధులు కళాశాలకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులకు ఏవిధంగా నష్టం వాటిల్లకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయమై సీఆర్‌ఆర్‌ కళాశాల ప్రధానాచార్యురాలు శైలజ స్పందించారు. రెండు కోర్సుల సిలబస్‌ ఒకటే అని తెలిపారు. ప్రశ్నపత్రాల బండిళ్లపై ఉన్న కోడ్‌ నంబర్‌ను సక్రమంగా పరిశీలించని కారణంగానే పొరపాటు జరిగిందన్నారు. ఈ విషయంపై విశ్వవిద్యాలయం ప్రతినిధులకు ఈ-మెయిల్‌ చేసినట్లు తెలిపారు. స్పందించిన ప్రతినిధులు విచారించేందుకు శనివారం ఒక అధికారిని పంపారన్నారు. వీసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు.

ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్​రెడ్డి

Last Updated : Nov 3, 2019, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details