తెలంగాణ సంబురం సద్దుల బతుకమ్మ పండుగ(Saddula Bathukamma Festival) చేసుకోవడానికి రాష్ట్రంలో ఆడబిడ్డలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడు రోజులుగా ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మను ఆడుకుంటూ సందడి చేశారు. రేపు వెన్నెముద్దల బతుకమ్మ ఎల్లుండి.. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) జరుపుకోవాల్సి ఉంది. కానీ ఈయేడు సద్దుల బతుకమ్మ సంబురంలో కాస్త అయోమయం నెలకొంది. కొందరు పండితులు బుధవారం రోజున అక్టోబర్ 13న సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) చేసుకోవాలని చెబుతుంటే.. మరికొందరేమో ఎంగిలిపూలు 6వ తేదీన ప్రారంభమయ్యాయి కాబట్టి.. 14వ తేదీ గురువారం రోజున తొమ్మిది రోజులు అవుతున్నందున ఆరోజు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే అక్టోబర్ 13నే దుర్గాష్టమి రావడం.. ఒకరోజు ముందుగానే సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma)ను చేసుకోవాలని కొందరు పండితులు చెప్పడం వల్ల రాష్ట్ర ఆడబిడ్డల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు.. సద్దుల బతుకమ్మ ఏర్పాట్లలో అధికారుల్లోనూ అయోమయం కలిగింది. వేడుకల నిర్వహణపై స్పష్టత లేకపోవడం వల్ల వాళ్లు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలు ఎప్పుడు నిర్వహించుకోవాలనే దానిపై పండితులను సంప్రదించి.. అధికారిక ప్రకటన విడుదల చేయాలని మహిళలు కోరుతున్నారు.
1. ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమావాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.