తెలంగాణ

telangana

పోలీసు శాఖను వీడని పదోన్నతుల గందరగోళం

పదోన్నతుల గందరగోళం పోలీస్‌ శాఖను వీడేలా లేదు. మొన్నటి దాకా అదనపు ఎస్పీల నుంచి ఇన్‌స్పెక్టర్ల వరకు పదోన్నతుల లొల్లి కాస్త తగ్గిందనుకునేలోపే కొత్తగా 2009 బ్యాచ్‌ ఎస్సైల వ్యవహారం తెరపైకి వచ్చింది.

By

Published : Apr 5, 2021, 7:07 AM IST

Published : Apr 5, 2021, 7:07 AM IST

telangana police department , promotions in telangana police department
తెలంగాణ వార్తలు, తెలంగాణ పోలీసు శాఖ, పదోన్నతులు

ఉమ్మడి రాష్ట్ర సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతుల కల్పనలో భాగంగా ఒకట్రెండు రోజుల్లో హైదరాబాద్‌ రేంజ్‌కు చెందిన 2009 బ్యాచ్‌లో 49 మంది ఎస్సైల జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. ఇపుడున్న ఖాళీల మేరకు ఈ జాబితాను రూపొందించినట్లు సమాచారం. అయితే.. ఇదే బ్యాచ్‌కు చెందిన మరికొందరు ఎస్సైలు తమకూ అవకాశం కల్పించాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో మరికొందరు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు లభిస్తాయని.. అలా జరిగితే తమకూ అవకాశం దక్కుతుందని ఈ వర్గం భావిస్తున్నట్లు తెలిసింది. అప్పటివరకు జాబితా రాకుండా ఉంచాలనేది వీరి ప్రయత్నంగా కనిపిస్తోంది. మరోవంక.. రెండేళ్ల క్రితం నాటి ప్యానెల్‌ ఇయర్‌లోనే తమ పదోన్నతులకు మార్గం సుగమైందని 49 మంది బృందం చెబుతోంది. కొత్తగా ప్రయత్నిస్తున్న వారికి ప్యానెల్‌ ఇయర్‌ ఆమోదం లభించనందున తమను అడ్డుకోవడం తగదనేది వీరి వాదన.

హైదరాబాద్‌లో 430 మంది.. వరంగల్‌లో 146

హైదరాబాద్‌ రేంజ్‌లో 1996, వరంగల్‌ రేంజ్‌లో 1995 బ్యాచ్‌ ఇన్‌స్పెక్టర్ల వివాదం మాదిరిగానే.. అదే రేంజ్‌ల్లోని 2012, 2009 బ్యాచ్‌ల మధ్య పదోన్నతుల్లో వివాదం నెలకొంది. నిజానికి 2009 బ్యాచ్‌ నుంచి హైదరాబాద్‌ రేంజ్‌కు 430 మంది, వరంగల్‌కు 146 మంది ఎస్సైలు ఎంపికయ్యారు. ఆయా రేంజ్‌ల్లో ఖాళీల ఆధారంగా మూడేళ్ల క్రితం ఈ బ్యాచ్‌కు చెందిన ఎస్సైల్లో వరంగల్‌ రేంజ్‌ నుంచి అంతా ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు పొందారు.. హైదరాబాద్‌ రేంజ్‌ నుంచి కేవలం 130 మంది ఇన్‌స్పెక్టర్లు అయ్యారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ రేంజ్‌లో 2009 బ్యాచ్‌కు చెందిన 300 మంది ఇప్పటికీ ఎస్సైలుగా ఉండగానే.. వరంగల్‌ రేంజ్‌లో 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలకు పదోన్నతులు కల్పించేందుకు ప్యానల్‌ ఇయర్‌ రూపొందడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే బ్యాచ్‌లో హైదరాబాద్‌ రేంజ్‌కు చెందిన 49 మంది పదోన్నతులకు రంగం సిద్ధం కావడంతో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు తమతో పాటే పనిచేసిన తోటి ఎస్సైలు ఇన్‌స్పెక్టర్లుగా మారితే వారికిందే పనిచేయాల్సి వస్తుందని హైదరాబాద్‌ రేంజ్‌కే చెందిన మిగిలిన ఎస్సైలు వాపోతున్నారు. అవసరమైతే సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా తమకూ పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. సూపర్‌ న్యూమరరీ పోస్టుల సృష్టి అంత తేలిక కానందున.. తమ పదోన్నతులకు అడ్డుపడటం సబబు కాదని 49 మంది ఎస్సైలు పేర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details