ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైకాపాలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే రోజా సొంత సెగ్మెంట్లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయని చర్చ జరుగుతోంది. నగరితో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ రోజా వ్యతిరేకవర్గం పెరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైకాపా తలపెట్టిన జనాగ్రహ దీక్ష సమయంలో నియోజకవర్గంలోని పలుచోట్ల రోజా వర్గీయులు, చక్రపాణి వర్గం వేర్వేరుగా దీక్షలు చేశారు. ఈ క్రమంలోనే సొంత పార్టీలోనే రోజాపై అసంతృప్తి పెరుగుతోందని ఆరోపణలు వస్తున్నారు. అలాంటిదేమీ లేదంటూ వైకాపా నేతలు కప్పిపుచ్చుకుంటున్నారు.
రోజా 'నగరి'లో మరోసారి బయటపడిన అంతర్గత విభేదాలు - conflict-between-two-groups-in-ycp-at-nagari
ఏపీలోని నగరి నియోజకవర్గంలో వైకాపాలో అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోజా వర్గం, చక్రపాణి వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి బయటపడినట్లు జోరుగా చర్చ జరుగుతోంది.
అసలేం ఏం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వైకాపాలో ఎమ్మెల్యే రోజా, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఉన్న చక్రపాణిరెడ్డి వర్గం మధ్య చాలాకాలంగా ఉన్న విభేదాలతో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో నెల క్రితం నిండ్ర మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక కోసం రోజా, చక్రపాణిరెడ్డి వర్గాలు పోటీ పడ్డాయి. ఇరువురు నేతలు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో రిటర్నింగ్ అధికారి కంటతడిపెట్టారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని నేతలు అధికారులను బెదిరించారు. ఎంపీపీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి భాస్కర్‌రెడ్డికి చక్రపాణిరెడ్డి మద్దతు ప్రకటించారు. కాగా దీనిని ఎమ్మెల్యే రోజా తీవ్రంగా వ్యతిరేకించారు. సొంతపార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రవర్తించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల తీరు పట్ల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య నిండ్ర ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు.