New Constitution issue in Rajya Sabha: ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మూల సూత్రాలకు తీవ్ర ముప్పు ఏర్పడిందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు పేర్కొన్నారు. విద్వేషపూరిత రాజకీయాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆవేశంగా మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర విస్మరణకు గురవుతున్నాయని ఆరోపించారు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బాగా ఆలోచించి కొత్త రాజ్యాంగం తీసుకురావాలన్న చర్చను దేశం ముందుపెట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్డీయే ప్రభుత్వ హయాంలో విద్వేషపూరిత ప్రసంగాలు 1,333% మేర పెరిగినట్లు టీవీల సర్వేల్లో వెల్లడైంది. హిందీ అంత సరళంగా అర్థంకానందున ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పాలని ఉదయం సభలో ఓ సభ్యుడిని కోరితే.. కార్మికశాఖ మంత్రి మాత్రం తాము హిందీ ఒక్కటే మాట్లాడతామని బదులిచ్చారు. ఇలాంటి వైఖరి పోవాలి. దక్షిణాది రాష్ట్రాల్లో చాలామందికి ఈ భాష అర్థమేకాదు. వారితో కలుపుగోలుకు ప్రయత్నించాలి.
మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి..
ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో చూడాలి. మీరు రాష్ట్రాల అధికారాలు లాగేసుకోవడానికే సమాఖ్యవ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకూ మద్దతిచ్చిన మేం ఇక భవిష్యత్తులో ఆ పని చేయకూడదని నిర్ణయించాం. మాలో అంతటి మార్పు ఎందుకు వచ్చిందో మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. పౌరసత్వ చట్టాన్ని మార్చడం ద్వారా రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని కేంద్రం విధ్వంసం చేసింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ బిల్లుల ద్వారా మతతత్వాన్ని పెంచిపోషించాలని చూసింది. త్వరలో తీసుకురాబోయే విద్యుత్తు చట్టసవరణ బిల్లుతో ప్రైవేటు వారు పంపిణీ రంగంలోకి వస్తారు. లాభాలొచ్చే ఏరియాలు వారి చేతుల్లోకి వెళ్తాయి. మారుమూల ప్రాంతాలకు కరెంటు ఇచ్చే బాధ్యత మాత్రం ప్రభుత్వంపై పడుతుంది. మేం రైతులకు 24 గంటలూ ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. ఈ బిల్లు కారణంగా ప్రతి మోటారుకు మీటరు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల రైతుల మెడపై కత్తి వేలాడదీసినట్లవుతుంది.
రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయంలో జోక్యం..
వ్యవసాయ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందన్న రాజ్యాంగ సూత్రాన్ని విస్మరించి కేంద్రం ఏకపక్షంగా సాగు చట్టాలు తెచ్చింది. 14 నెలలు ఆందోళన చేసి 700 మందికి పైగా రైతులు చనిపోవడానికి కారణమైంది. రాష్ట్రపతి ప్రసంగంలో దాని గురించి ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని చెప్పినా చట్టబద్ధతేమీ కల్పించలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ గతంలో చెప్పారు. కానీ సాగు ఖర్చులు రెండింతలయ్యాయి. ప్రస్తుత వ్యవసాయ వృద్ధిరేటు 3.9%. అన్నదాతల ఆదాయం రెట్టింపు కావాలంటే ఇది 12-14% నమోదుకావాలి. దేశం మొత్తం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు. మీ హయాంలో రాజ్యాంగ మూల సూత్రాలైన లౌకికతత్వం, గవర్నర్ కార్యాలయాలు, రాష్ట్ర పరిధిలోని అంశాలు ప్రమాదంలో పడిపోయాయి. ఇప్పటికే మనం 105 రాజ్యాంగ సవరణలు చేసినా సంతృప్తికరంగా లేదు. అందువల్ల రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనను కేసీఆర్ దేశం ముందు చర్చకు పెట్టారు’’ అని కేశవరావు పేర్కొన్నారు.
వనరుల పంపిణీలో దక్షిణాదికి అన్యాయం