Agnipath Protest: దేశం..! మాతృభూమి..! ఈ రెండు మాటలు విన్నప్పుడు మదిలో మెదిలే తొలి దృశ్యం... సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికులు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం కంటే మించిన త్యాగం ఇంకేం ఉంటుంది. అందుకే... 18 ఏళ్లు నిండిన చాలా కుర్రాళ్లు సైన్యంలో చేరడమే తమ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆర్మీ యూనిఫాం వేసుకుంటే వచ్చే కిక్కే వేరు. రైఫిల్ పట్టుకుని... సరిహద్దుల్లో గస్తీ కాస్తుంటే వచ్చే ఆనందమే వేరు. మరికొందరు మాత్రం... చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం. సమాజంలో సైనికుడనే గౌరవం. దేశమంతా పని చేసే అవకాశం తదితర కారణాలతో సైన్యంలో చేరడమే ఊపిరిగా బతుకుంటారు. వీటిని నిజం చేసుకోవడానికి.. లక్ష్యం వెంబడి పరిగెడుతూనే ఉంటారు. వీలైతే జవాన్... అవకాశం ఉంటే ఆఫీసర్ స్థాయిలో సైన్యంలో అడుగుపెట్టడానికి శక్తి మేర ప్రయత్నిస్తుంటారు.
కరోనా కారణంగా... అన్ని రకాల ఉద్యోగ నియామకాలు ఆగిపోయాయి. నిత్యం జరిగే ఆర్మీ ర్యాలీలు నిలిచిపోయాయి. దేశంలో యువత అంతా.. ఎప్పుడెప్పుడు ఆర్మీ ర్యాలీ నిర్వహిస్తారా..? అని కాళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరిహద్దుల్లో గస్తీ కాయాలనే తపనతో లక్ష్యం వైపు పరిగెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 90రోజుల్లో ఆర్మీ ర్యాలీ చేపడతామని ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఆశావహులందరూ 'హమ్మయ్యా' అనుకున్నారు. కానీ... ఇది వరకు ఉన్న పాత విధానంలో కాదంటూ.. సరికొత్త పంథాలో నాలుగేళ్ల కాల పరిమితితో అగ్నిపథ్ అనే షార్ట్ సర్వీస్‌కు శ్రీకారం చుడుతున్నట్లు అంతలోనే సర్కార్ ప్రకటించటంతో... ఒక్కసారిగా చిచ్చురేగింది.
కేంద్రం ప్రకటించిన 'అగ్నిపథ్' స్కీమ్‌లో నాలుగేళ్ల సర్వీస్ ఉంటుంది. దీనిలో చేరేందుకు 17న్నర నుంచి 21 ఏళ్ల మధ్య యువత అర్హులు. ఎంపికైన వారికి మెుదటి ఆరు నెలల శిక్షణ ఇస్తారు. అనంతరం.. సాయుధ, టెక్నికల్ తదితర అంశాల్లో మూడున్నర సంవత్సరాలు పని చేయాలి. వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇందులో ప్రవేశం పొందిన వారిని... అగ్నివీరులుగా పిలుస్తారు. అగ్ని వీరులకు... నెలకు 30వేల రూపాయలు జీతంగా ఇస్తారు. ఇందులో 30శాతం అంటే.. 9వేలు రూపాయలు సేవానిధికి వెళ్తుంది. చేతికి.. 21 వేల రూపాయలు అందుతాయి. 2వ ఏడాది లో.. 33వేలు, 3వ సంవత్సరంలో 36వేల 500, 4వ సంవత్సరంలో 40వేల రూపాయలు అందిస్తారు. ఈ నాలుగేళ్ల కాలాన్ని కాంట్రాక్ బేసిస్‌గా భావించవచ్చు. ఎందుకంటే.. ఈ ఉద్యోగులకు గ్రాట్యూటీ, పెన్షన్లు వర్తించవు. అలా అని ఇది పూర్తిగా ఉద్యోగ భద్రత లేని జాబ్ కాదు. ఎందుకంటే.. సర్వీసులో ఉన్న అగ్నివీరుడు వ్యక్తిగతంగా తమ నెలవారీ జీతభత్యాలలో 30% చందగా కట్టాలి. దానికి సమాన మెుత్తం, ప్రభుత్వం కూడా సమాకూరుస్తుంది. నాలుగు సంవత్సరాల తరువాత ఆదాయపు పన్ను మినహాయింపులతో సుమారు 11లక్షల 71 వేల రూపాయలు ప్రతి ఉద్యోగికి దక్కుతాయి. అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవం ఉంటుందని కేంద్రం వెల్లడించింది.