రాష్ట్రంలో ప్రభుత్వ రంగ, వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయి. రైతులు, వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలన్న లక్ష్యంతో... సహకార బ్యాంకులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం... విప్లవాత్మక సంస్కరణలు శ్రీకారం చుట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నాయి. ఇతర బ్యాంకుల మాదిరే అన్ని రకాల డిజిటల్ సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో తెస్తున్న విప్లవాత్మక మార్పులపై ప్రశంసలూ వెల్లువెత్తుతున్నాయి. నీతి ఆయోగ్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, నాబార్డ్ ప్రతినిధులు స్వయంగా హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ సందర్శించి సేవలను కొనియాడారు.
లాభాలబాటలో...
కంప్యూటీకరణ తర్వాత అన్ని సేవల్లో పారదర్శకత పెరిగి సహకార సంఘాలు లాభాలబాటలో నడుస్తుండటం విశేషం. పూర్తి కంప్యూటరీకరణ చేపట్టడంతో దేశవ్యాప్త గుర్తింపు దక్కింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు దృష్టి సారించాయి. జనవరిలో ఆర్బీఐ, నాబార్డ్ నేతృత్వంలో జరిగే అఖిల భారత సహకార బ్యాంకుల సమావేశంలో.... సొసైటీల కంప్యూటీకరణ, సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్‌పై ప్రజెంటేషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర అధికారులకు ఆహ్వానం అందినట్లు టెస్కాబ్ సీఐఓ ముప్పనేని శ్రీనివాస్ తెలిపారు.