తెలంగాణ

telangana

ETV Bharat / city

భూసమస్యలన్నీ పరిష్కరించేలా రాష్ట్రంలో సమగ్ర భూసర్వే

సమగ్ర భూసర్వేకు సర్కారు సన్నద్ధమైంది. ముందుగా ప్రభుత్వ భూముల సర్వే చేపట్టి.. ఆ తర్వాత పట్టా భూముల ప్రక్రియ మొదలు పెడతారు. మూడు నెలల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని భావిస్తోంది. భూ దస్త్రాల ప్రక్షాళన వేళ ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర భూ సర్వే చేపడుతోంది.

land survey
land survey

By

Published : Mar 20, 2021, 8:11 AM IST

భూ భారతి.. భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాలలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సమగ్ర భూ సర్వేకు సిద్ధమవుతోంది. రెండు మూడు నెలల్లోనే సర్వే ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తోంది.దీంతో భూ సమస్యలన్నింటికీ చరమగీతం పాడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనికోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రయివేట్‌ సంస్థలను సర్వేకు వినియోగించుకోనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొదట ప్రభుత్వ భూముల సర్వే
అక్షాంశాలు, రేఖాంశాలతో కచ్చితమైన హద్దులు గుర్తించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డీజీపీఎస్‌ సర్వేకు సర్కారు మొగ్గుచూపుతోంది. దీనిలో భాగంగా మొదట రాష్ట్రంలో ఉన్న అటవీ, దేవాదాయ, అసైన్డ్‌, వక్ఫ్‌, ఇతర ప్రభుత్వ భూముల హద్దులను తేల్చాలనేది ప్రణాళిక. ప్రభుత్వం వద్ద ఉన్న మాతృ దస్త్రాల సహాయంతో సర్కారు భూముల సర్వే చేపడతారు. దస్త్రాలు లేని వాటికి గ్రామాల్లోని సమాచారం ఆధారంగా హద్దులు నిర్ణయిస్తారు. ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడినట్లు తేలితే నోటీసులు జారీచేస్తారు. గడువు ఇచ్చి యాజమాన్య హక్కులు, లింక్‌ దస్త్రాలను సమర్పించాలని సూచించి సరిచేయనున్నారు.
సెటిల్‌మెంట్‌ అధికారి సమక్షంలో...
కొన్ని జిల్లాల్లో సర్వే నంబర్లు ఒక చోట, సాగు చేస్తున్న ప్రాంతం మరో చోట ఉన్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అంతేకాదు చేతిరాత దస్త్రాల్లో విస్తీర్ణం పెరగడం, తరగడం చోటుచేసుకుంది. సర్వే సందర్భంగా వీటిని సరి చేసే సమయంలో వాటి యజమానులు అభ్యంతరపెట్టే పరిస్థితులు ఉన్నాయి. కొలతల్లో రైతుల విస్తీర్ణాలు తగ్గినా, పెరిగినా వివాదాలు తలెత్తుతాయని ప్రభుత్వం ముందే ఓ అంచనాకు వచ్చింది. దీనిలో భాగంగా ప్రతి డివిజన్‌కు ఒక సర్వే సెటిల్‌మెంట్‌ అధికారిని నియమించనున్నారు. రైతు దస్త్రాల్లో నమోదైన విస్తీర్ణం కన్నా రైతు ఆధీనంలో ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తే దాన్ని వెనక్కు తీసుకుంటారు. అవసరమైతే దానికి పరిహారం చెల్లించే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ దస్త్రాల్లో నమోదైన విస్తీర్ణం కన్నా తక్కువ ఉన్నట్లు తేలితే.. ఆ గ్రామంలో సర్వే పూర్తయిన తరువాత మిగులు భూమిని గుర్తిస్తే ఇలాంటి రైతులకు సర్దుబాటు చేస్తారు.
భూ భారతి అనుభవాలతో...
జాతీయ భూ దస్త్రాల ఆధునికీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద 2005లో నిజామాబాద్‌ జిల్లాలో భూ భారతి కార్యక్రమం చేపట్టారు. ఏరియల్‌ ఫొటోగ్రఫీ సర్వే విధానాన్ని ఇక్కడ అమలు చేశారు. 914 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపట్టి దస్త్రాలను సిద్ధం చేయగా 11 వేల అభ్యంతరాలు నమోదయ్యాయి. తమ భూమి తక్కువగా వచ్చిందని, తప్పులు ఉన్నాయని, పక్కవారికి తమ భూమి వెళ్లిందని ఇలా పలువురు రైతులు అభ్యంతరాలు లేవనెత్తారు. దీంతో తిరిగి వారందరికీ నోటీసులు జారీచేయగా మూడు వేల మంది సర్వేకు అంగీకరించారు. ఈ ప్రక్రియలో ఎదురైన అనుభవాలను రెవెన్యూ శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుని సమగ్ర సర్వేకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details