AR CONSTABLE BHANU PRAKASH COMPLAINT:లక్ష్మి అనే మహిళ చేత తప్పుడు వాంగ్మూలాన్ని తీసుకొని తనని ఉద్యోగం నుంచి తొలగించారని వారిపై చర్యలు తీసుకోవాలని డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ఫిర్యాదు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, అడిషనల్ ఎస్పీ హనుమంతప్ప, ఎస్పీ ఫక్కీరప్పపై ఫిర్యాదు చేశాడు. నిన్న లక్ష్మీ అనే మహిళ మీడియా ముందుకు వచ్చి తాను డబ్బులు, బంగారం ఇవ్వలేదని ప్రత్యక్షంగా చెప్పిందన్నారు. అయితే ఆమెను బెదిరించి తనపై కుట్ర చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారన్నారు.
ఆమె తనకు ఎటువంటి డబ్బులు, బంగారం ఇవ్వలేదని చెప్పినా, ఈ కేసుకు సంబంధించి కోర్టులో వ్యవహారం నడుస్తున్నా, చట్టానికి విరుద్ధంగా ఎస్పీ ఫక్కీరప్ప తనని ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగని పక్షంలో కోర్టు ద్వారా వెళ్తానని చెప్పారు. రాజకీయంగాను ముఖ్యమంత్రిని కలవడానికి వెనకాడనని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే:తనను బూచిగా చూపి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగించారని ఆ కేసులో పోలీసులు బాధితురాలుగా పేర్కొన్న బి.లక్ష్మి తెలిపారు. నా భర్త, అతని కుటుంబసభ్యులు నన్ను వేధిస్తున్నారని నాలుగేళ్ల కిందట అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2019లో ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వెళ్లాను. అక్కడున్న సీఎం వలీ అనే కానిస్టేబుల్ నా ఫిర్యాదు రాస్తానని చెప్పి, నేను నా భర్త వేధింపుల గురించి చెప్తే ఆయన మరోలా రాశారు. కానిస్టేబుల్ ప్రకాశ్ నన్ను వేధిస్తున్నట్లు, అత్యాచారం చేసినట్లు, నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసినట్లుగా రాశారు. ఎస్పీ వెళ్లిపోతున్నారని తొందరపెట్టి స్టేట్మెంట్ చదివే అవకాశం ఇవ్వకుండానే నాతో సంతకం చేయించుకున్నారు. దాని ఆధారంగానే కేసు నమోదుచేసి, అప్పటి డీఎస్పీ వీరరాఘవరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారు.