ఓ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరుమీద మ్యుటెషన్ చేసి పట్టదారు పాసుపుస్తకాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగారు. అతని బాధను చూసిన జిల్లా కలెక్టర్ స్పందించారు. పాసుపుస్తకాలు ఇవ్వాలని గతంలోనే తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. అయినా తహసీల్దార్ స్పందించని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
వెంకటరమణ అనే ఓ స్థిరాస్తి వ్యాపారి రాయదుర్గం నియోజకవర్గం డీ.హీరేహాల్ లో 40 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనికి భూమి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని తహసీల్దార్‌కు తగిన ధృవపత్రాలతో దరఖాస్తు చేశారు. అన్నీ సరిగ్గానే ఉన్నాయని చెప్పిన తహసీల్దార్ పట్టాదారు పాసుబుక్ మాత్రం ఇవ్వడం లేదని బాధితుడు ఆరోపించారు.
ఏడాదిన్నర కాలంగా వెంకటరమణ జిల్లా కలెక్టరేట్‌కు తిరుగుతూ స్పందనలో ఎనిమిదిసార్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై గతంలోనే కలెక్టర్ నాగలక్ష్మీ స్పందించి తహసీల్దార్‌కు తగిన ఆదేశాలు జారీచేసినా.. క్షేత్రస్థాయిలో అవి అమలుకాలేదని వెంకటరమణ పేర్కొన్నారు. తమకు కలెక్టర్ చెబితే సరిపోదని.. ప్రజాప్రతినిధి చెబితేనే భూమికి పాస్‌బుక్ వస్తుందని రెవెన్యూ అధికారులు నిర్మొహమాటంగా చెప్పేశారని బాధితుడు వెల్లడించారు.