తెలంగాణ

telangana

ETV Bharat / city

భూసేకరణ అధికారుల నియామకానికి కేంద్రం ఆమోదం

హైదరాబాద్‌ అవుటర్ రింగ్ రోడ్డు అవతలి నుంచి నిర్మించనున్న ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి రాష్ట్ర సర్కార్ భూసేకరణ అధికారులను నియమించారు. ఈ నియామకాన్ని ఆమోదిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

competent authority for RRR
competent authority for RRR

By

Published : Apr 1, 2022, 9:32 AM IST

హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు అవతలి నుంచి నిర్మించనున్న ప్రాంతీయ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన భూసేకరణ అధికారుల(కాంపిటెంట్‌ అథారిటీ) నియామకాన్ని ఆమోదిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-జగ్‌దేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌ మీదుగా 158.60 కిలోమీటర్ల మేర ఉత్తర భాగానికి కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల పరిధిలో ఈ మార్గం రానుంది. ఉత్తర భాగంలో 4,760 ఎకరాల మేరకు భూమి సేకరించాల్సి ఉంది. ఏడుగురు ఆర్డీవోలు, ఒక అదనపు కలెక్టర్‌ను భూసేకరణ అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలోని అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), భువనగిరి ఆర్డీవో, చౌటుప్పల్‌ ఆర్డీవో, మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌, తూప్రాన్‌, సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, అందోల్‌-జోగిపేట, సిద్దిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్‌ ఆర్డీవోలను భూసేకరణ అధికారులుగా ధ్రువీకరిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. నాలుగు జిల్లాల్లోని 18 మండలాల పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంది. ఎన్ని గ్రామాల్లో భూసేకరణ చేయాలన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. తొలుత రూపొందించిన ముసాయిదాలో 111 గ్రామాలుండగా, ఆ తరవాత పలు నివేదికల్లో 84 గ్రామాలు, తాజాగా రూపొందించిన ముసాయిదాలో 113 గ్రామాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏయే గ్రామాల మీదుగా ఈ మార్గం వెళ్తుందన్నది ఖరారు చేస్తూ ఏప్రిల్‌ రెండో వారంలోగా మరో గెజిట్‌ను కేంద్రం జారీ చేయనుంది.

ఇక భూసేకరణే తరవాయి : భూసేకరణ అధికారుల నియామకానికి ఆమోదముద్ర వేయటంతో ఆయా అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ప్రాంతీయ రింగ్‌ రోడ్డు కన్సల్టెన్సీ సంస్థ రోడ్డు వెళ్లే గ్రామాల మీదుగా గుర్తులు ఏర్పాటు చేసింది. భూసేకరణ అధికారులు గ్రామాల వారీగా రహదారి వెళ్లే భూమిని గుర్తించి.. భూముల యజమానులకు నోటీసులు జారీ చేస్తారు. 21 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తరువాత భూసేకరణ ప్రక్రియను చేపడతారు. ఈ ప్రక్రియ అంతటినీ పూర్తి చేసేందుకు సుమారు 4 నుంచి 5 నెలల వ్యవధి పడుతుందని అంచనా. భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. భూసేకరణ ప్రక్రియ సింహభాగం కొలిక్కివచ్చిన తరవాత రహదారి నిర్మాణానికి వీలుగా గుత్తేదారు ఎంపికకు టెండర్లు ఆహ్వానిస్తారు.

ABOUT THE AUTHOR

...view details