తెలంగాణ

telangana

ETV Bharat / city

పట్టభద్రుల ఎన్నికల్లో కామ్రేడ్స్ నిర్ణయమేంటి.. ? - పట్టభద్రుల ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరగబోయే ఎన్నికలకు పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. కమ్యూనిస్టులు కూడా పోటీకి ప్రణాళికలు రచిస్తున్నారు. వామపక్షాల ఐక్యత కోసం ఉమ్మడి అభ్యర్థిలను నిలపాలని అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. మద్దతు ఇవ్వాలని ఇప్పటికే... కోదండరాం, చెరుకు సుధాకర్​... ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులను కలిసి కోరారు.

communists may decide to will contest or support others in graduate mlc elections
పట్టభద్రుల ఎన్నికల్లో కామ్రేడ్స్ నిర్ణయమేంటి.. ?

By

Published : Sep 25, 2020, 10:13 AM IST

రాష్ట్రంలో మార్చిలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసేందుకు కామ్రేడ్స్‌ సిద్ధమవుతుంటే... తమకు మద్దతివ్వాలంటూ ఇతర పార్టీల నేతలు కమ్యూనిస్టులను అభ్యర్థిస్తున్నారు. కానీ కామ్రేడ్స్‌ మాత్రం అభ్యర్థులను బరిలో నిలిపేందుకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై సీపీఎం, సీపీఐ, తెజస, తెదేపా కలిసి పోరాటాలు నిర్వహించాయి. భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికలకు ఈ పార్టీలు కూటమిగా జట్టుకట్టే అవకాశం ఉందని అంతా భావించారు. పట్టభధ్రుల ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే పోటీకి దిగుతామని ప్రకటించుకుంటున్నారు.

అదే జరిగితే..

చట్టసభల్లో అడుగు పెట్టాలని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మూడు మాసాల నుంచే అనేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమావేశాలతో ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, తెదేపా, తెలంగాణ ఇంటి పార్టీల మద్దతివ్వాలని కోదండరాం అభ్యర్థించారు. పార్టీలో చర్చించాక తమ నిర్ణయం ప్రకటిస్తామని అన్ని పార్టీలు తెలియజేశాయి. కమ్యూనిస్టులు... మాస్టర్‌కు మద్దతిస్తారని అంతా భావించినప్పటికీ... ఊహించనీ విధంగా వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థిని నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇదే జరిగితే... ఖమ్మం, నల్గొండ, వరంగల్​ జిల్లాల్లో కాస్తో, కూస్తో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నందున... కోదండరాం విజయావకాశాలు తక్కువగానే ఉంటాయి.

నిర్ణయం పెండింగ్..

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ జర్నలిస్ట్‌ను బరిలో నిలిపేందుకే యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థిని నిలపాలా? మద్దతు కోరిన వారిని బలపరచాలా? అనేది... రాష్ట్ర కార్యదర్శివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీపీఎం మాత్రం పోటీకి దూరంగా ఉంటున్నట్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే వామపక్షాలు మద్దతివ్వనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నుంచి పోటీ చేయాలనుకుంటున్న కోదండరాం, చెరుకు సుధాకర్‌... మద్దతివ్వాలని కోరినట్టు చెప్పారు. సీపీఐ కూడా తమ అభ్యర్థిని బరిలో దింపుతామని... ఇప్పటికిప్పుడే ఎవరికి హామీ ఇవ్వొద్దని కోరినట్టు వెల్లడించారు. ప్రస్తుతానికి ఎవరిని బలపరిచేది నిర్ణయించలేదన్నారు.

కేసీఆర్​ వ్యూహమేనా..?

చట్టసభల్లో కోదండరాం అడుగుపెడితే తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం లేకపోలేదని భావించిన గులాబీ దళపతి... చెక్​ పెట్టేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. కోదండరాం, తెరాసకు మద్దతివ్వకుండా అభ్యర్థులను బరిలో నిలపాలని కామ్రేడ్స్​ను కేసీఆర్​ కోరినట్టు ప్రచారం సాగుతోంది. అందులా భాగంగానే... కలిసి ఐక్య ఉద్యమాలు చేసిన సీపీఎం, సీపీఐ, తెజస, తెదేపా... పట్టభద్రుల ఎన్నికల్లో వేర్వేరుగా ముందుకెళ్తున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ రణక్షేత్రంలో కమ్యూనిస్టులు పోరులోకి దిగుతారా? ఇతర పార్టీలకు మద్దతిస్తారా? గులాబీ గుబాళింపునకు అంతర్గతంగా దోహదం చేస్తారా? అన్నది వేచి చూడాలి.

ఇదీ చూడండి:మధ్యాహ్నం బిహార్​ ఎన్నికల షెడ్యూల్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details