రోజువారీ కొవిడ్ కేసులు పెరగడం, విద్యాసంస్థల మూసివేత, మహారాష్ట్రలో కర్ఫ్యూ విధింపు పరిణామాలు రాష్ట్రంలో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. లాక్‌డౌన్ విధిస్తారన్న ఊహగానాలతో ముందుగానే నిత్యావసర వస్తువులు కొనుగోలుకు హైదరాబాద్ వాసులు మార్కెట్ల వద్ద బారులు తీరుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతుండడం...రానున్న రోజుల్లో మన రాష్ట్రంలోనూ ఆంక్షలు అమలవుతాయని భావిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతాయనే భావనతో ముందుగానే మూడు నెలలకు సరిపడా సరుకు తెచ్చి ఇంట్లో దాచుకుంటున్నారు.
మార్కెట్‌లో బియ్యం, పప్పులు, వంట నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కొవిడ్‌ను సాకుగా చూపి వ్యాపారులు ఇష్టారాజ్యంగా దగా చేస్తున్నారని వినియోదారులు వాపోతున్నారు. మహమ్మారితో ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న తమకు ధరాభారం గుడిబండలా మారిందని ఆవేదన వ‌్యక్తం చేస్తున్నారు.