తెలంగాణ

telangana

ETV Bharat / city

RESULTS: త్వరలో పది, ఇంటర్​ ఫలితాలు - ఛాయరతన్‌ కమిటీ

కరోనా వల్ల విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయాలని ఏపీ హైకోర్డు ఆదేశించడంతో దానికి అవసరమైన కార్యాచరణ చేపట్టేందుకు ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తోంది. విద్యార్థులకు మార్కులను కేటాయించడం విషయంలో ఛాయరతన్‌ కమిటీని నియమించింది.

Tenth Class Results, Results Committee, Inter Results in AP, AP Tenth Class Results
పదో తరగతి ఫలితాలు, ఫలితాల కమిటీ, ఏపీలో ఇంటర్ ఫలితాలు, ఏపీ పదో తరగతి ఫలితాలు

By

Published : Jul 3, 2021, 10:10 AM IST

ఏపీలో.. ఇంటర్మీడియట్‌ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంటర్‌ రెండో ఏడాది ఫలితాలకు(INTER RESULTS).. ప్రథమ సంవత్సరం మార్కులతో పాటు పదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కుల మదింపునకు నియమించిన ఛాయరతన్‌ కమిటీ రెండు, మూడు రోజుల్లో నివేదికను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శికి సమర్పించనున్నట్లు సమాచారం. ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులు 2019లో పది, 2020లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను రాశారు. ఈ రెండింటిని కలిపి రెండో ఏడాది మార్కులను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది.

ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులిలా..

పదోతరగతి మార్కులకు 30శాతం, బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రథమ సంవత్సరంతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రయోగ పరీక్షలతో కలిపి 70శాతం చొప్పున వెయిటేజీ తీసుకొని రెండో ఏడాదికి వంద శాతానికి మార్కులను ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆర్ట్స్‌ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉండనందున ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కులకే 70శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం పదో తరగతి మార్కుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని ఇంటర్‌ విద్యామండలి కోరింది. ఇంటర్‌ మొదటి ఏడాది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ బ్యాచ్‌ విద్యార్థులు గతేడాది పదోతరగతి పరీక్షలు రాయలేదు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు రద్దయ్యాయి. దీంతో వీరి ఫలితాల విడుదలకు ఏ విధానం పాటించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. మొదటి ఏడాదికి అందరికీ ఉత్తీర్ణత మార్కులు ఇవ్వడమా? లేదంటే రెండో ఏడాది పరీక్షలు పూర్తయిన తర్వాత వాటి ఆధారంగా మొదటి ఏడాదికి మార్కులు ఇవ్వడమా? కరోనా తగ్గిన తర్వాత అంతర్గతంగా ఏమైన పరీక్షలు నిర్వహించడమా? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నారు.

పదిపైనా కమిటీ ఏర్పాటు..

పదో తరగతి ఫలితాల్లో అవలంబించాల్సిన విధానాలపై కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు. పదోతరగతికి సైతం విశ్రాంత ఐఏఎస్‌ ఛాయరతన్‌ ఛైర్‌పర్సన్‌గా కమిటీని నియమించారు. ఇందులో సుమారు 10మంది వరకు సభ్యులుగా ఉన్నారు. ఫలితాల విడుదలకు అవలంబించాల్సిన పద్ధతులపై 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. పదో తరగతి విద్యార్థులకు 2020-21లో ఒక్కో పరీక్షను 50 మార్కుల చొప్పున రెండు ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహించారు. 2019లో పదిలో అంతర్గత మార్కుల విధానాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంద మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీంతో పదో తరగతిలో అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవాలంటే గతంలో ఇచ్చిన వాటికి సవరణ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.

ఇవీ చదవండిCovid: మూడో దశను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా సిద్ధమేనా?

ABOUT THE AUTHOR

...view details