బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రాష్ట్రం సాధించిన విజయాలను వివరించారు. గత ఆరేళ్లలో రాష్ట్రం ఎన్నో సవాళ్లను అధిగమించి, ఆర్థికంగా నిలదొక్కుకుందన్న ఆమె.. తలసరి ఆదాయం లక్షా 12వేల 162 నుంచి 2 లక్షల 28 వేల 216 రూపాయలకు పెరిగిందని వివరించారు.
భారత్ బయోటెక్‌పై..
కరోనా పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా వెనకబడినా... ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని కాపాడుకోగలిగిందని పేర్కొన్నారు. వైరస్ కట్టడి.. మరణాల నియంత్రణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బాధితులకు వైద్య సేవల్లోనూ రాష్ట్రం ముందుందన్న గవర్నర్.. దేశానికి వ్యాక్సిన్ అందించిన భారత్ బయోటెక్ హైదరాబాద్‌లో ఉండటం అందరికీ గర్వకారణమని పునరుద్ఘాటించారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులపై.. సర్కారు ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపిన తమిళిసై.. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. నీటి వివాదాలు స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడం సహా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని వివరించారు.
దేశానికే అన్నపూర్ణ..
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో.. ప్రభుత్వ పథకాలు, చర్యలతో రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా అవతరించిందని స్పష్టం చేశారు. రైతుకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ.. వ్యవసాయ రంగంలో గణనీయ వృద్ధి సాధించామన్న గవర్నర్.. ఉచిత విద్యుత్, సాగునీరు, మార్కెటింగ్ సౌకర్యాలు, రైతుబంధు, రైతుబీమా సాయంతో అన్నదాతలు ధైర్యంగా సాగుచేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి.. కోటి 41 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం... ప్రస్తుతం 2 కోట్ల 10 లక్షలకు చేరుకోవడమే.. రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. వ్యవసాయ భూముల విషయంలో ధరణి పోర్టల్ విప్లవాత్మక సంస్కరణగా నిలిచిందని గవర్నర్ వివరించారు.