తెలంగాణ

telangana

ETV Bharat / city

సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: ఏపీ ఉద్యోగ సంఘాలు

AP Employees Strike: పీఆర్‌సీ సాధన సమితి సభ్యులతో.. ఏపీ మంత్రుల కమిటీ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటన చేశారు.

ap employees strike
ap employees strike

By

Published : Feb 5, 2022, 10:50 PM IST

Updated : Feb 6, 2022, 9:18 AM IST

ఉద్యోగ సంఘాల నాయకులతో ఏపీ ప్రభుత్వ చర్చలు ఫలించాయి. హెచ్‌ఆర్‌ఏ కొంతమేర పెంచేందుకు, సీసీఏ కొనసాగించేందుకు, అదనపు క్వాంటం పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచే (గతంతో పోలిస్తే కొంత తక్కువతో) అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దాంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. ఐఆర్‌ రికవరీ చేయరాదని, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగులు చేస్తున్న డిమాండ్‌లకు శుక్రవారం చర్చల్లోనే అంగీకరించిన ఏపీమంత్రుల కమిటీ... శనివారం ఇంకొన్ని మెట్లు దిగి మరిన్ని డిమాండ్‌లపై సానుకూలంగా స్పందించింది. ఫిట్‌మెంట్‌ను 23% కంటే పెంచాలన్న డిమాండ్‌కు మాత్రం అంగీకరించలేదు. మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ సదుపాయాన్ని పొడిగించేందుకు సమ్మతించింది. ఉద్యోగులు, పెన్షనర్లు మరణిస్తే అంతిమ సంస్కారాలకు (మట్టి ఖర్చులు) రూ.25 వేలు ఇస్తామంది. పెంచిన గ్రాట్యుటీని 2018 నుంచి కాకుండా, 2022 జనవరి నుంచి మాత్రమే అమలు చేస్తామంది. ఉద్యోగ సంఘాల నాయకులూ తమ పట్టు కొంత సడలించి, ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు అంగీకారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో పలు అంశాలపై ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది.

విభేదించిన ఉపాధ్యాయ సంఘాలు...

ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాత్రం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో విభేదించారు. శనివారం రాత్రి చర్చలు ముగిశాక మంత్రుల కమిటీ సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమ్మె ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. చర్చలకు నల్లబ్యాడ్జీలతో హాజరైన ఉద్యోగ సంఘాల నాయకులు... విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాటిని తొలగించారు. విలేకరుల సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయిన... పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, ఏపీటీఎఫ్‌-1938 అధ్యక్షుడు హృదయరాజు, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య, ఎస్టీయూ అధ్యక్షుడు సుధీర్‌బాబు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల డిమాండ్‌లలో మొదటిదైన 27% ఫిట్‌మెంట్‌ని కూడా సాధించుకోలేకపోయామన్నారు. 30% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ, డిమాండ్‌ల పరిష్కారం కోసం తమతో కలసి వచ్చే సంఘాలతో కలసి ఉద్యమిస్తామని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.భానుమూర్తి, పాండురంగ వరప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

హెచ్‌ఆర్‌ఏపైనే ఎక్కువ సమయం తర్జనభర్జనలు

ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శనివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. శుక్రవారం ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. హెచ్‌ఆర్‌ఏ వంటి అంశాలపై మరికొన్ని వెసులుబాట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. సచివాలయంలో రెండో బ్లాక్‌లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు... ఉద్యోగ సంఘాల నాయకులతో, మంత్రుల కమిటీ మళ్లీ సమావేశం మొదలైంది. ఫిట్‌మెంట్‌ని కనీసం 27 శాతానికైనా పెంచాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేయగా... అది ముగిసిన అంకమని, ఫిట్‌మెంట్‌పై ఇదివరకే నిర్ణయమైపోయినందున, దానిపై చర్చకు ఆస్కారం లేదని మంత్రుల కమిటీ స్పష్టంచేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ప్రధానంగా చర్చంతా... హెచ్‌ఆర్‌ఏ పెంపుపైనే జరిగింది. మంత్రుల కమిటీ పలు ప్రతిపాదనలు చేయడం, దానికి ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించకపోవడం... ఉద్యోగ సంఘాలు అడిగినంత హెచ్‌ఆర్‌ఏ ఇస్తే ప్రభుత్వంపై చాలా భారం పడుతుందని, అంత ఇవ్వడం కుదరదని మంత్రులు చెప్పడం... ఇలా చాలా సమయంపాటు చర్చోపచర్చలు జరిగాయి. కొత్త ప్రతిపాదన చర్చకు వచ్చిన ప్రతిసారీ... సీఎస్‌, సజ్జలలో ఎవరో ఒకరు మరోగదిలో ఉన్న ఆర్థిక శాఖ అధికారుల వద్దకు వెళ్లి, దాన్ని అమలు చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందోనని లెక్కలు వేయడం... మళ్లీ వచ్చి చర్చల్లో కూర్చోవడం... అలా పలుసార్లు జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10 గంటల సమయానికి వివిధ అంశాలపై ఇరువర్గాలకు ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం తమ చర్చల సారాంశాన్ని, ఇచ్చిన హామీల్ని ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రులు ఫోన్‌లో వివరించారు. అనంతరం రాత్రి 11 గంటలకు మంత్రులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి నిర్ణయాలు ప్రకటించారు.

మంత్రుల కమిటీతో, ఉద్యోగ సంఘాల నాయకుల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు ఇవీ..!

  • ప్రస్తుతమున్న 13 జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్నవారికి 16% హెచ్‌ఆర్‌ఏ వర్తింపు
  • సచివాలయం, విభాగాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 24% హెచ్‌ఆర్‌ఏ. 2024 జూన్‌ వరకు ఈ సదుపాయం వర్తింపు.
  • సవరించిన హెచ్‌ఆర్‌ఏ 2022, జనవరి 1 నుంచి అమల్లోకి.
  • విశ్రాంత ఉద్యోగుల్లో 70-74 వయసువారికి 7%, 75-79 ఏళ్ల వయసువారికి 12% అదనపు క్వాంటం పింఛను వర్తింపు.
  • ఉద్యోగులకు పదకొండో వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదికను జీవోలు జారీ చేయగానే అందజేస్తారు.
  • ఫిట్‌మెంట్‌ 23 శాతమే కొనసాగుతుంది.
  • గ్రాట్యుటీ 2022 జనవరి నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది.
  • 1.7.2019 నుంచి 31.3.2020 వరకు చెల్లించిన ఐఆర్‌ మొత్తాన్ని ఉద్యోగుల నుంచి రికవరీ చేయరు. రూ.5-6 వేల కోట్ల డీఏ బకాయిలు రిటైర్‌మెంట్‌ సమయానికి సర్దుబాటు చేస్తారు.
  • కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ విధానానికి బదులుగా, ఇది వరకులా ప్రతి ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ విధానమే వర్తింపజేస్తారు.
  • ఉద్యోగులు, పెన్షనర్లు మరణిస్తే అంత్యక్రియల ఖర్చులకు రూ.25 వేలు.
  • సీసీఏ గతంలో రేట్ల ప్రకారమే కొనసాగుతుంది.
  • కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలకు వంటివాటికి పీఆర్సీ అమలుపై విడిగా జీఓలు జారీ చేస్తారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా విడిగా జీవో ఇస్తారు.
  • సీపీఎస్‌ రద్దు అంశాన్ని నిర్దిష్ట కాలావధిలో పరిష్కరించేందుకు అవసరమైన రోడ్‌ మ్యాప్‌ని వచ్చే నెలాఖరుకి సిద్ధం చేస్తారు.
  • ఒప్పంద ఉద్యోగుల జీతభత్యాల వ్యవహారాలపై నియమించిన కమిటీనే, ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులు వంటివారి వ్యవహారాల్నీ పర్యవేక్షిస్తుంది.
  • ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ సదుపాయం కొనసాగింపుపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తారు.
  • ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్‌) త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపడతారు.
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసుని 2022 జూన్‌కి క్రమబద్ధీకరించి, స్కేల్స్‌ అమలు చేస్తారు.

తేడా ఏమిటంటే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కొత్త వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సవరణలకు అంగీకరించింది. 2022 పీఆర్సీ అమలుకు సంబంధించి జనవరి 17న వెలువరించిన ఉత్తర్వుల విషయంలో అసంతృప్తి రేగడంతో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి శనివారం రాత్రి తాజా ప్రకటన చేసింది. ఇంతకుముందు వెలువరించిన నిర్ణయాలు కొన్నింటిలో మార్పులు చేసింది. వీటిలో కొన్నింటి అమలు 2022 జనవరి నుంచి అని పేర్కొంది. మరికొన్ని నిర్ణయాల అమలు ఎప్పటి నుంచి అన్నది స్పష్టం చేయలేదు. విడుదలయ్యే జీవోల్లోనే స్పష్టత రావాల్సి ఉంటుంది. కొత్త పీఆర్సీకి సంబంధించి 2022 జనవరి 17న వెలువరించిన జీవోలోని అంశాలకు, తాజాగా ప్రభుత్వం శనివారం ప్రకటించిన వాటిలో మార్పులు ఏమిటి అన్నది పరిశీలిద్దాం...

2022 జనవరి 17 జీవోల ప్రకారం...
1. ఫిట్‌మెంట్‌ 23 శాతం

2. ఐఆర్‌ 27 శాతం రికవరీ (సర్దుబాటు)

3. హెచ్‌ ఆర్‌ ఏ శ్లాబులు ఇలా...

  • 5 లక్షలలోపు జనాభా ఉంటే మూలవేతనంపై 8శాతం
  • 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే 16శాతం
  • 50 లక్షలకు పైగా జనాభా ఉంటే 24శాతం

4. సీసీఏ పూర్తిగా తొలగింపు

5 కేంద్ర ప్రభుత్వం ప్రకారం పదేళ్లకు ఒకసారి వేతన సవరణ కమిషన్‌

6. అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌

  • 80 ఏళ్ల నుంచి మూల పెన్షన్‌పై 20శాతం అదనం
  • 85 ఏళ్ల నుంచి 30శాతం అదనం
  • 90 ఏళ్ల నుంచి 40 శాతం అదనం
  • 95 ఏళ్ల నుంచి 50 శాతం అదనం
  • 100 ఏళ్ల నుంచి మూల పెన్షన్‌పై 100శాతం అదనం

7. మట్టి ఖర్చులు గరిష్ఠంగా రూ.20 వేలు

2022 ఫిబ్రవరి 5 రాత్రి నిర్ణయాల ప్రకారం....
1. ఫిట్‌మెంట్‌లో మార్పు లేదు

2. ఐఆర్‌ 27 శాతం 9 నెలలకు సంబంధించి రికవరీ ఉండబోదు

3. హెచ్‌ ఆర్‌ ఏ శ్లాబులు ఇలా...

  • 50 వేలలోపు జనాభా ఉంటే మూలవేతనంపై 10శాతం లేదా గరిష్ఠంగా 11వేలు
  • 50 వేల నుంచి 2లక్షల జనాభా వరకు 12శాతం లేదా గరిష్ఠంగా 13 వేలు
  • 2 లక్షల నుంచి 50 లక్షల వరకు 16శాతం లేదా గరిష్ఠంగా రూ.17 వేలు
  • 50 లక్షలకు మించి ఉంటే మూలవేతనంపై 24శాతం, గరిష్ఠంగా రూ.25వేలు
  • సచివాలయాలు, విభాగాధిపతి కార్యాలయాల ఉద్యోగులకు 24శాతం 2024 జూన్‌ వరకు.

4. సీసీఏ పాతవి పునరుద్ధరణ

5. గతంలో ఉన్న పద్ధతిలోనే 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు

6. అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌

  • 70 ఏళ్ల నుంచి 74 ఏళ్ల వరకు 7 శాతం
  • 75 నుంచి 79 ఏళ్ల వరకు 12శాతం ,
  • 80 ఏళ్ల నుంచి ఆ పైబడి

జనవరి 17 నాటి జీవోలో పేర్కొన్నవే కొనసాగింపు..

7.మట్టి ఖర్చులు రూ.25 వేలు.

ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకుంది

ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకుంది. మా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మెరుగైన పీఆర్‌సీ ఇస్తారని ఉద్యోగులు ముఖ్యమంత్రిపై ఎక్కువ ఆశపెట్టుకున్నారు. ఆ క్రమంలో ఉద్యమంలో భాగంగా ముఖ్యమంత్రిపై మేము వ్యాఖ్యలు చేసుంటే వాటిని ఆయన అన్యథా భావించొద్దు. ఆదివారం పీఆర్‌సీ సాధన సమితి నాయకులు అంతా ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపుతాం. - బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్‌

సమస్యల పరిష్కారానికి ఇది ఆరంభం మాత్రమే

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇది ఒక ఆరంభం మాత్రమే. అన్ని సమస్యలు పరిష్కారమైపోయాయని మేము చెప్పట్లేదు. నాలుగు ఐకాసల నాయకులం కలిసి పనిచేసి ఉద్యోగుల మిగతా కోర్కెల సాధన కోసం కృషిచేస్తాం. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నవారిపై కేసులేమి పెట్టలేదని, ఏవైనా పెట్టి ఉంటే తీసేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి, ఛైర్మన్‌

ప్రభుత్వోద్యోగులకు ఈ రోజు శుభదినం

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈ రోజు శుభదినం. వ్యవస్థలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఉంటుంది. మరికొన్ని విషయాల్లో అంగీకారం ఉండదు. మా డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసిన వెంటనే కమిటీని ఏర్పాటు చేసి ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించినందుకు ధన్యవాదాలు. మొత్తం 17 అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం వెల్లడించింది. ప్రభుత్వం, పీఆర్‌సీ సాధన సమితికి మధ్య కుదిరింది మంచి డీల్‌ అని భావిస్తున్నాం. - కె.సూర్యనారాయణ, పీఆర్‌సీ సాధన సమితి

గంటల వ్యవధిలోనే ఆమోదయోగ్య పరిష్కారం చూపారు

రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతులు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల అందరికీ 2024 మార్చి వరకూ 24 శాతం హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపునకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. పీఆర్‌సీలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించారు. ముఖ్యమంత్రికి ఉద్యోగులపై ఎంత అభిమానం ఉందో మరోసారి చూపించారు. ఆవేదనలో ఉద్యోగులు ఎవరైనా హద్దుమీరి మాట్లాడి ఉంటే.. వారిని పెద్ద మనుసుతో క్షమించాలని కోరుతున్నాం.-కె.వెంకట్రామిరెడ్డి, పీఆర్‌సీ సాధన సమితి

మెజార్టీ అభిప్రాయాన్ని తీసుకుని సమ్మె విరమణ

ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా స్టీరింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మిగతా విషయాలన్నింటిని అంగీకరిస్తూనే 27 శాతం ఫిట్‌మెంట్‌ ఉంటే బాగుంటుందనే ఉద్దేశాన్ని వారు వెలిబుచ్చారు. అయితే మెజార్టీ అభిప్రాయాన్ని తీసుకుని సమ్మె విరమిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. వారు మా ఐకాసలో సభ్యులే కాబట్టి.. వారితో చర్చించి ఆదివారం ముఖ్యమంత్రితో జరిగే సమావేశానికి తీసుకెళ్తాం. ఉద్యమంలో ఇలాంటి ఒడుదొడుకులు సహజమే- ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ఏకాభిప్రాయంతో సమస్యలు పరిష్కారం: సజ్జల

ఉన్నంతలో మెరుగైన పీఆర్సీనే ఇచ్చినప్పటికీ... ఉద్యోగులు ఆశించినంతగా లేనందున వారు చెందిన ఆవేదన, అసంతృప్తి గుర్తించాక... వాటిలో కొన్నిటినైనా చక్కదిద్దాలన్న లక్ష్యంతో మంత్రుల కమిటీ ఏర్పాటైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో వారు ప్రస్తావించిన ప్రతి అంశంపై లోతుగా చర్చించామన్నారు. వాటిపై ఏకాభిప్రాయానికి వచ్చామని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని భావించిన సీఎం వారి డిమాండ్‌లపై సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు.

రిక‘వర్రీ’ మిగిలే ఉందా?

పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం శనివారం రాత్రి వెలువరించిన నిర్ణయాలపై ఉద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాలపై ప్రభుత్వం జీవోలిస్తే తప్ప స్పష్టత రాదని పేర్కొంటున్నారు. మధ్యంతర భృతి 9నెలల పాటు రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ ప్రకటించింది. అదే సమయంలో ఇంటి అద్దెభత్యం శ్లాబులు 2022 జనవరినుంచి మాత్రమే తాజా ప్రకటన ప్రకారం అమలవుతాయని వెల్లడించింది. అంటే 2020 ఏప్రిల్‌నుంచి 2021 డిసెంబరు31 వరకు కొత్త జీవో1లోని మార్చిన ఇంటి అద్దెభత్యం మాత్రమే లెక్కలోకి తీసుకుంటారని స్పష్టమవుతోంది. అంటే మోనిటరీ ప్రయోజనం లెక్కించిన 21నెలల కాలానికి కనీసంగా 4శాతం, గరిష్ఠంగా 14శాతం మేర ఇంటి అద్దెభత్యం రికవరీ చేస్తున్నట్లేనా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మోనిటరీ ప్రయోజనం సమయంలో ఫిట్‌మెంటు 23శాతంగా నిర్ణయించారు. ఫిట్‌మెంట్‌లో ఎలాంటి మార్పు లేదు. అదే సమయంలో 21 నెలల మోనిటరీ ప్రయోజన కాలంలో 23శాతం ఫిట్‌మెంట్‌ ప్రకారమే ఉద్యోగి పొందాల్సిన జీతం లెక్కిస్తున్నారు. మరోవైపు ఉద్యోగి పొందిన జీతంలో ఆ 21నెలల ఐఆర్‌ కలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో అక్కడ 4శాతం నష్టపోతున్నట్లు కొందరు ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ విషయంలోనూ ఇదే సమస్య ఎదురుకానుంది. పాత విధానానికి, శనివారంనాటి మంత్రుల కమిటీ నిర్ణయానికి మధ్య 8శాతం పింఛను వ్యత్యాసం ఉంది.

రివర్స్‌, రికవరీ, రిటైర్‌మెంట్‌ పీఆర్సీ...

కొత్త పీఆర్సీని కొందరు ఉద్యోగులు ఆర్‌ఆర్‌ఆర్‌ పీఆర్సీ అని అభివర్ణిస్తున్నారు. ఐఆర్‌ 27శాతం ఇచ్చి ఫిట్‌మెంట్‌ 23శాతానికి తగ్గించడం లోగడ ఎన్నడూ లేదని, అలాగే రివకరీలు చూడలేదని పేర్కొంటున్నారు. తాజాగా మంత్రుల కమిటీ నిర్ణయాల వల్ల ఉద్యోగుల పదవీ విరమణ తర్వాతే బకాయిలందుతాయి. అంటే ఐఆర్‌ రికవరీ లేకపోవడం వల్ల డీఏల బకాయిలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని 4విడతలుగా జీపీఎఫ్‌కు జమ చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఈ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామంటున్నారు. దాదాపు రూ.6,000 కోట్లు ఇలా చెల్లించాల్సి ఉంటుందని లెక్కించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆ రకంగా ఇది రిటైర్‌మెంట్‌ పీఆర్సీ అంటూ విమర్శలు వస్తున్నాయి. కరవుభత్యం ఇచ్చేది ధరల పెరుగుదలకు అనుగుణంగా అని, అలాంటిది ఈ ప్రయోజనాలు పదవీ విరమణ తర్వాత ఇవ్వడంవల్ల ఏం సాధించినట్టని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగుల గ్రూపుల్లో అసహనం..

ఉపాధ్యాయ సంఘాలు, కొన్ని ఉద్యోగ గ్రూపులు ఇప్పటికే ఈ నిర్ణయాలతో విభేదించాయి. 2015 పీఆర్సీలో ఉన్నస్థాయిలో హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, అదనపు క్వాంటమ్‌ఆఫ్‌ పెన్షన్‌ సాధించలేకపోవడం పట్ల గ్రూపుల్లో చర్చ సాగుతోంది. జిల్లాకేంద్రాల్లోని ఉద్యోగులకు 16శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుచేస్తామని విలేకరుల సమావేశంలో ప్రకటించినా తీర్మానాల ప్రతిలో లేకపోవడమూ చర్చనీయాంశమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపైనా స్పష్టత రాలేదు.

ఇదీ చూడండి:PM Modi on Samatamurthy: 'జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం'

Last Updated : Feb 6, 2022, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details