తెలంగాణ

telangana

ETV Bharat / city

పన్ను ఎగవేత వ్యాపారులపై వాణిజ్య పన్నుల శాఖ కొరడా - undefined

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పాత దస్త్రాలకు దుమ్ము దులిపే కార్యక్రమం వేగవంతమైంది. గతంలో వ్యాపారులు ఎగవేత పాల్పడిన సుమారు రెండు వేల కోట్ల రూపాయల వసూళ్లకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పదివేల మంది డీలర్లకు 30వేలకు పైగా నోటీసులు ఇచ్చిన అధికారులు... 21 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

commercial-tax-department

By

Published : Jul 12, 2019, 10:40 AM IST


అధికారుల కళ్లు గప్పి పన్ను ఎగవేతకు పాల్పడిన కొందరు వ్యాపారుల నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముమ్మరం చేసింది. 2014-15 నుంచి 2016-17 వరకు జీఎస్టీ అమల్లోకి వచ్చే వరకు... మూడు ఆర్థిక సంవత్సరాలకు చెందిన పాత దస్త్రాల దుమ్ము దులుపుతున్నారు అధికారులు. ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోనే విక్రయించి... ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు జరిపినట్లు చూపారని గుర్తించారు. స్థానికంగా చెల్లించాల్సిన 14.5 శాతం వ్యాట్‌కు బదులు రెండు శాతం మాత్రమే కేంద్ర అమ్మకపు పన్ను చెల్లించి... మిగతా12.5 శాతం పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సాఫ్ట్​వేర్​ ద్వారా నోటీసులు

ఇతర రాష్ట్రాలకు సరుకులు పంపినప్పుడు... వే బిల్లులు వాడడం తప్పనిసరి కావడం వల్ల... ఆ వివరాలన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఆ వివరాలను తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం... ఇందుకు ప్రత్యేకమైన సాప్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా ఆయా డీలర్లకు నోటీసులు అందించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఆయా డీలర్లు ఇచ్చే వివరణలతో బేరీజు వేసి ఎంత పన్ను ఎగవేతకు గురైందో కూడా ఈ సాప్ట్‌వేర్‌ తేల్చేస్తుంది.

30వేలకు పైగా నోటీసులు

ఇప్పటివరకు 10వేల మందికి పైగా వ్యాపారులకు 30వేలకుపైగా నోటీసులు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జారీ చేశారు. మూడేళ్లలో ఆయా డీలర్ల నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా అయిన సరుకుల విలువ ఎంత? అందుకు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులెంత? తదితర వివరాలు సమర్పించాలని కోరారు. వివరణ ఇవ్వడానికి 21 రోజులు గడువు ఇచ్చినందున... నోటీసులు అందుకున్న కొందరు వ్యాపారులు తమ వద్ద ఉన్న వివరాలతో అధికారులకు సమాధానం ఇస్తున్నారు. అలా వచ్చిన వివరాలను... వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న వివరాలతో అధికారులు పోల్చి చూస్తున్నారు. ఆయా డీలర్లు ఇచ్చే వివరణలో... ఎంత మొత్తం తేడా ఉంది? ఎంత సరుకు బయట రాష్ట్రాలకు పంపారు? అందుకు చెల్లించిన పన్నుల వివరాలతో కూడి తిరిగి ఆయా డీలర్లకు మెయిల్‌ పంపుతున్నారు. వాటిని చూసుకున్న తరువాత కొందరు తమ న్యాయవాదుల సహకారంతో సంబంధిత వాణిజ్యపన్నుల అధికారి వద్దకు వచ్చి తమ వాదనలను వినిపిస్తున్నారు.

ఐదుకు... రెండు చెల్లించారు

ఎగవేతకు గురైన సొమ్ము ఎంతో... వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సంబంధిత డీలర్లకు స్పష్టం చేస్తున్నారు. వేలల్లో నోటీసులు ఇచ్చినందున... వాటికి సంబంధించి పని విభజన చేశారు. డీసీటీవో నుంచి సహాయ కమిషనర్‌ వరకు ప్రతి అధికారికి 50 నోటీసులకు సంబంధించిన పనిని అప్పగించారు. ఆయా డివిజన్‌ పరిధిలో సంబంధిత డిప్యూటీ కమిషనర్‌.... రోజువారీగా ఎన్ని నోటీసులకు వివరణలు వచ్చాయి? వాటికి తిరిగి ఇస్తున్న వివరణలేంటి? ఆయా డీలర్ల నుంచి రావాల్సిన సొమ్ము ఎంత? అన్న అంశాలపై రోజువారీగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రధానంగా రైస్‌ మిల్లర్లు, పప్పు మిల్లర్లు.. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చే వరకు ఇతర రాష్ట్రాలకు పంపిన సరుకు విలువపై అయిదు శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా... కేవలం రెండు శాతమే చెల్లించినట్లు గుర్తించారు. దీంతో ఆయా రైస్‌ మిల్లర్లు, దాల్‌ మిల్లర్లపై ప్రత్యేక దృష్టిసారించి ఎగవేతకు గురైన సొమ్మును వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

2వేల కోట్లు ఎగవేసినట్లు సమాచారం

ప్రధానంగా బయట రాష్ట్రాలకు సరుకు పంపినట్లు చెబుతున్న డీలర్లను రెండు రకాలుగా విభజించారు. సీ-ఫారం, ఎఫ్-ఫారంపై ఇతర రాష్ట్రాలకు సరుకు తరలించడం వల్ల ఎక్కువ పన్ను ఎగవేతకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో తమ శాఖలు ఉన్నందున అక్కడికి సరుకు పంపామని చెప్పి.... నయాపైసా కూడా పన్ను చెల్లించని డీలర్లు.. అందుకు సంబంధించి ఎఫ్-ఫారాన్ని వాణిజ్య పన్నుల శాఖకు అందచేయాలి. కానీ చాలా మంది ఇవ్వలేదు. అదే విధంగా ఇతర రాష్ట్రాలకు సరుకు సరఫరా చేసిన డీలరు... సీ -ఫారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొందరు ఇవ్వలేదు. ఇలా ఆయా ఫాంలు ఇవ్వకపోవడంతో... సరుకు బయటకు వెళ్లకుండానే పోయినట్లు నకిలీ రశీదులు సృష్టించారన్న అనుమానాలు కూడా అధికారుల్లో వ్యక్తమవుతోంది. మొత్తం ప్రక్రియ పూర్తయితే ఏకంగా రెండువేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ నెల 18, 19న శాసనసభ ప్రత్యేక సమావేశాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details