కృష్ణానదికి వరద పోటెత్తడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు భారీగా వస్తోందని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి సుమారు 5.58 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని... దానిని దిగువకు విడుదల చేస్తున్నారన్నారు. అలాగే నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 256 టీఎంసీల నీరు ఉందని కలెక్టర్ తెలిపారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయికి చేరుకోవడానికి కనీసం 56 టీఎంసీలు కావాలన్నారు. సాగర్ డ్యాం రేపు ఉదయానికి నిండుతుందని... ఆ తర్వాత ఐదు లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతల ప్రాజెక్టుకు వదులుతారన్నారు. పులిచింతల ప్రాజెక్టులో ఇప్పటికే సామర్ధ్యం మేరకు పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉన్నందున.. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు రేపు సాయంత్రానికి చేరుకుంటుందన్నారు.
వరద ఉద్ధృతి ఎక్కువుంది..!
జగ్గయ్యపేట నుంచి నాగాయలంక వరకు నదీ పరివాహక ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడుదల అయిన తర్వాత ఐదు వరద కాలువల నుంచి నివాస ప్రాంతాల్లోకి నీరు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వరద నీరు నిరోధించడానికి ఆయా ద్వారాలను సిమెంట్, ఇసుక బ్యాగ్‌లతో మూసివేసి వచ్చే నీటిని ఎత్తివేసేందుకు మోటార్లను సిద్ధం చేయాలన్న్నారు.