హైదరాబాద్‌లో కాయిన్ మ్యూజియం.. నేటి నుంచే ప్రారంభం - హైదరాబాద్‌లో కాయిన్ మ్యూజియం
Coin Museum in Hyderabad : ప్రపంచం క్రిప్టో కరెన్సీ వైపు పరుగులు పెడుతున్నవేళ భావితరాలకు అప్పటి, ఇప్పటి నాణేల ముద్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సైఫాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ‘మింట్(కాయిన్) మ్యూజియం’ ప్రారంభమైంది. జూన్ 13 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
Coin Museum in Hyderabad
By
Published : Jun 8, 2022, 8:28 AM IST
హైదరాబాద్‌లో కాయిన్ మ్యూజియం
Coin Museum in Hyderabad : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సైఫాబాద్ టంకశాలలో మ్యూజియం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్) సంకల్పించింది. ఈ మేరకు ఏడు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు. 1901 నాటి ఈ భవనం శిథిలావస్థకు చేరుకోగా పునరుద్ధరించడంతోపాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం ఎస్‌పీఎంసీఐఎల్ సంస్థ ఛైర్మన్, ఎండీ త్రిప్తిఘోష్ దీన్ని ప్రారంభించారు.
దేశ చరిత్ర, గతంలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేసిందనే విషయంపై యువతరానికి అవగాహన కల్పించేందుకే దీన్ని ఏర్పాటు చేసినట్టు ఎస్‌పీఎంసీఐఎల్ సంస్థ ఛైర్మన్, ఎండీ త్రిప్తిఘోష్ తెలిపారు. వందేళ్ల కిందట భాగ్యనగరంలో కరెన్సీ ముద్రణకు వాడిన లండన్ నుంచి తెచ్చిన యంత్రాలను ప్రదర్శనలో ఉంచకపోవడం తొలిరోజు సందర్శకులకు నిరాశ కలిగించింది.
షేర్‌షా సూరి కాలం నాటి తొలి రూపాయి నుంచి
నిజాం కాలం నుంచి ఇప్పటివరకు అచ్చు వేసిన నాణేలు, అందుకోసం ఉపయోగించిన పనిముట్లు, యంత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. షేర్‌షా సూరి కాలం నాటి తొలి నాణెం మొదలుకుని ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. వాటిని అచ్చువేసిన తీరును వివరించే ఏర్పాట్లుచేశారు. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఇందుకు సంబంధించి సుమారు వందేళ్ల చరిత్రకు సంబంధించిన వీడియో ప్రదర్శన ఉంటుంది.
1803 నుంచి 1997 వరకు...
1803లో హైదరాబాద్ రాజ్యంలో అసఫ్‌జా-3 మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్‌జా కాలంలో పనిముట్లతో నాణేల ముద్రణ ప్రారంభమైంది. సుల్తాన్‌షాహీలో ఉన్న రాయల్ ప్యాలెస్‌లో ఏర్పాటైన మింట్‌లో నిజాం సంస్థానం నాణేలు తయారయ్యేవి. 1895లో లండన్ నుంచి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. పూర్తిస్థాయిలో ఆధునికీకరించే ఉద్దేశంతో సైఫాబాద్‌లో ప్రత్యేక భవనాన్ని నిర్మించి 1903లో యూరప్ మింట్‌ల తరహాలో ఏర్పాటుచేశారు. 1918లో హైదరాబాద్ కరెన్సీ చట్టాన్ని తెచ్చి, నోట్ల ముద్రణనూ ప్రారంభించారు. 1997 వరకు సైఫాబాద్‌లోని టంకశాలలోనే కరెన్సీని ముద్రించారు. తర్వాత చర్లపల్లిలో కొత్త మింట్‌ను ఏర్పాటు చేశారు. ‘‘వందేళ్ల కాలంలో ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన నాణేలను, పతకాలను ఈ సందర్భంగా విక్రయిస్తున్నామని’’ మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.
ఆకట్టుకుంటున్న 11 కిలోల బంగారు నాణెం నమూనా..
మొఘల్ చక్రవర్తుల్లో ఒకరైన జహంగీర్ కాలంలో 1613లో రూపొందించిన 11.938 కిలోల బంగారు నాణేనికి సంబంధించిన నమూనాను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. నిజాం ఉల్‌ముల్క్ అసఫ్‌జా తండ్రి షా-అబు-ది-దిన్‌ఖాన్ బహదూర్ ఫిరూజ్ జంగ్‌కు దీనిని బహూకరించారు. దీనిని స్విట్జర్లాండ్‌లో వేలం వేయగా, నాణేలు సేకరించే వ్యక్తి ఒకరు దాని నమూనాని రూపొందించి మింట్‌కు అందించారు.
థీసిస్ ఆధారంగా మ్యూజియం :'నేను రూపొందించిన థీసిస్ ఆధారంగా మ్యూజియం ఏర్పాటుచేయడం సంతోషంగా ఉంది. బెంగళూరులో ఆర్‌వీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తిచేశాక 2020 జనవరిలో సైఫాబాద్ మింట్‌పై థీసిస్ ప్రారంభించా. అక్టోబరులో ఆ నివేదికను చర్లపల్లి మింట్ జీఎం జేపీ దాస్‌కు సమర్పించా. మ్యూజియం ఇక్కడ ఏర్పాటుచేస్తే బాగుంటుందని వివరించాం. అనంతరం దిల్లీకి ప్రతిపాదనలు పంపించగా వెంటనే అనుమతినిచ్చారు.' -- పి.ప్రవణి, ఆర్కిటెక్ట్