తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Revenue deficit: ఆదాయం ఇంత.. అప్పు కొండంత.. కాగ్ సంచలన నివేదిక

ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు.. ఆదాయానికి మించి విపరీతంగా పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర రెవెన్యూ లోటు(AP Revenue deficit) కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతోంది. రెవెన్యూ లోటును పరిమితం చేస్తామని ఎప్పటికప్పుడు చెప్పడమే తప్ప, ఆ దిశగా జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నలూ చేయడం లేదని కాగ్ పేర్కొంది. ఈ మేరకు లెక్కలు ప్రకటించింది.

AP Revenue deficit, cog report
ఏపీ రెవెన్యూ లోటు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ 2021

By

Published : Nov 14, 2021, 9:57 AM IST

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు(AP Revenue deficit) కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు ఆదాయానికి మించి విపరీతంగా పెరగడమే దీనికి కారణం. రెవెన్యూ లోటును పరిమితం చేస్తామని ఎప్పటికప్పుడు చెప్పడమే తప్ప ఆ దిశగా జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదని కాగ్‌ తాజా లెక్కల్ని బట్టి తేటతెల్లమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు అంచనా రూ.5000.06 కోట్లుగా బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నెలాఖరు వరకు కాగ్‌ విడుదల చేసిన ఏపీ ఆదాయ, వ్యయ లెక్కల ప్రకారం.. తొలి ఆరు నెలల్లోనే రెవెన్యూ లోటు రూ.33,140.62 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం కంటే రెవెన్యూ లోటు 662.80 శాతం పెరిగినట్టు. మిగతా ఆరు నెలలూ గడిచేసరికి రెవెన్యూ లోటు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రెవెన్యూ లోటును రూ.18,434.15 కోట్లుగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

2020 సెప్టెంబరు నెలాఖరుకు రూ.45,472.77 కోట్ల (మొత్తం బడ్జెట్‌ అంచనా కంటే 246.68% ఎక్కువ)కు చేరింది. కిందటేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రెవెన్యూ లోటు(AP Revenue deficit) తగ్గినట్టు కనిపిస్తోంది. బడ్జెట్‌ అంచనాలతో పోల్చితే నిరుటి కంటే ఈ ఏడాది భారీగా పెరిగింది. 2021-22 బడ్జెట్‌లో ద్రవ్యలోటు అంచనా రూ.37,029.79 కోట్లుగా ఏపీ ప్రభుత్వం పేర్కొనగా, మొదటి ఆరు నెలల్లోనే రూ.39,914.18 కోట్లకు చేరింది. బడ్జెట్‌లో ఏడాది కాలానికి ప్రతిపాదించిన అంచనాల్ని ఆరు నెలల్లో దాటేయడమే కాకుండా, అదనంగా ఏడు శాతం లోటు నమోదవడం గమనార్హం.

ఆదాయం పెరిగినా..!

కొవిడ్‌ తగ్గుముఖం పట్టడం, వ్యాపారాలు మళ్లీ గాడిన పడటం వంటి కారణాలతో నిరుటి కన్నా ఈ ఏడాది ఏపీ ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో రెవెన్యూ ఆదాయం రూ.44,915 కోట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.64,871 కోట్లు వచ్చింది. రెవెన్యూ ఆదాయమే సుమారు రూ.20 వేల కోట్లు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఏపీకి అన్ని రూపాల్లోనూ (అప్పులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు కూడా కలిపి) రూ.1,04,804.91 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.2,14,276 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా... మొదటి ఆరు నెలల్లో 48.91 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఆ రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయంలో అప్పులే రూ.39,914.18 కోట్లు ఉన్నాయి. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.37,079.95 కోట్ల రుణాన్ని జగన్ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించగా... మొదటి ఆరు నెలల్లోనే సుమారు రూ.40 వేల కోట్ల రుణం తీసుకోవడం గమనార్హం. పన్నుల ఆదాయం నిరుడు రూ.29,936 కోట్లు ఉండగా, ఈ సంవత్సరం రూ.44,987 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రెవెన్యూ వ్యయం రూ.98,012.31 కోట్లు ఉంది. మొత్తం బడ్జెట్‌ అంచనాల్లో ఇది 53.79 శాతం.

మూలధన వ్యయంలో వెనుకబాటు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసే కీలకమైన మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకోవడంలో వైకాపా ప్రభుత్వం బాగా వెనుకబడింది. 2021-22 బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని రూ.31,198.38 కోట్లుగా ప్రతిపాదించగా, మొదటి ఆరు నెలల్లో రూ.6,711.60 కోట్లు (21.51%) మాత్రమే ఖర్చు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రూ.2,912.39 కోట్లు తక్కువ.

ఇదీ చదవండి:Drug trafficking in telangana: శిక్ష పడదు.. మత్తు వదలదు.. నేరం ఆగదు!!

ABOUT THE AUTHOR

...view details