తెలంగాణ

telangana

ETV Bharat / city

కో'ఢీ' కొడుతుందా.. ? పోలీసుల హెచ్చరికలు పనిచేస్తాయా..?

సంక్రాంతికి పందెం కోడి కత్తి కడుతుందా...?. బరిలో దిగనివ్వబోమన్న పోలీసుల హెచ్చరికలు పనిచేస్తాయా?. ఇవే ప్రశ్నలు ఇప్పుడు పందెం రాయుళ్లను తొలచి వేస్తున్నాయి. పండుగకు కోడి పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ హైకోర్టు పునరుద్ఘాటించిన నేపథ్యంలో ...అందుకు తగ్గట్టుగా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. కానీ కొంత మంది పందెం రాయుళ్లు మాత్రం గుట్టుగా తమ పని తాము చేసుకుపోతున్నారు.

cock-fight-betting-on-sankranti-in-andhra-pradesh
కో'ఢీ' కొడుతుందా.. ? పోలీసుల హెచ్చరికలు పనిచేస్తాయా..?

By

Published : Jan 11, 2021, 9:41 AM IST

కో'ఢీ' కొడుతుందా.. ? పోలీసుల హెచ్చరికలు పనిచేస్తాయా..?

సంక్రాంతి వచ్చిందంటే చాలు. పందెం రాయుళ్లకు పండగే. ఈసారి కోడి పందేలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ.. హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పందేలు నిర్వహించే వారిని బైండోవర్‌ చేయడం, కత్తుల్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. కానీ పందేల రాయుళ్లు మాత్రం గుట్టుగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఏపీలోని ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుట్టుగా బరుల సిద్ధం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారీ చివరి నిమిషంలో ఆటంకాలన్నీ తొలగిపోయి బరిలో కోడిని దించగలమని ధీమా ప్రదర్శిస్తున్నారు.

రహస్య ప్రదేశాల్లో నిర్వాహణ...

ఏటా కోడి పందేలు నిర్వహించే ప్రదేశాలపై పోలీసుల నిఘా పెరగడం.. అక్కడ ఏర్పాటు చేస్తున్న బరులను గుర్తించి ధ్వంసం చేయడం వల్ల పందెం రాయుళ్లు దారి మారుస్తున్నారు. రహస్య ప్రదేశాలను ఎంపిక చేసుకుని బరులు సిద్ధం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఉండి, ఆకివీడు, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పెనుగొండ, అత్తిలి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు, గణపవరం తదితర ప్రాంతాల్లో బరులు సిద్ధమవుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం ప్రాంతాల్లో బరులు ఏర్పాటు రహస్యంగా సాగుతోంది. కేశనకుర్రుపాలెంలో మూడెకరాల వ్యవసాయ భూమిని ఇప్పటికే చదును చేశారు. వాహనాలు నిలిపేందుకు 5 ఎకరాల కొబ్బరి తోటను సిద్ధం చేశారు. ముమ్మిడివరం మండలంలోనూ పందేల నిర్వహణకు రహస్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు, ఈడ్పుగల్లు, ఉప్పులూరులో బరులు సిద్ధం చేస్తుండగా పోలీసులు వాటిని ధ్వంసం చేసేశారు. గన్నవరం, పెనమలూరు , గుడివాడలో గుట్టుచప్పుడు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

బరుల వద్ద గుండాట, పేకాట, కోతాట శిబిరాల నిర్వహణకు అవకాశమిచ్చేందుకు నిర్వాహకులు గతంలో బహిరంగ వేలం పాట నిర్వహించేవారు. పోలీసుల నిఘా పెరగడంతో ఈసారి అందుకు భిన్నంగా అనధికారిక ఒప్పందాలు జరుగుతున్నాయి. బరుల స్థాయిని బట్టి ఇంత మొత్తం చెల్లిస్తామంటూ జూద నిర్వాహకులు బేరసారాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తాల్లో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది.

ముందుగానే బుకింగ్..

భోగి రోజు నుంచి ఏదో ఒక విధంగా కోడిపందేలు నిర్వహించొచ్చన్న ధీమాతో ఉన్న పందెం రాయుళ్లు.. ‘మర్యాద పిలుపు’ల్లో తలమునకలయ్యారు. పెద్ద ఎత్తున పందేలు ఆడే అలవాటున్న వారిని ఆహ్వానిస్తున్నారు. భీమవరం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లోని లాడ్జిల్లో గదులు, ఇతర ప్రదేశాల్లోని అతిథిగృహాలను పండగ రోజుల కోసం ఇప్పటికే అనధికారిక ఒప్పందం కుదుర్చుకుని బుక్‌ చేసుకున్నారు. మరికొన్ని చోట్ల విశాలమైన గృహాలు, అపార్ట్‌మెంట్లను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం వీటికి గిరాకీ పెరిగింది. సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు అద్దె వసూలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:నడిరోడ్డుపై కత్తులు, వేట కొడవళ్లతో నరికి చంపేశారు

ABOUT THE AUTHOR

...view details