CM Jagan Review On Omicron Variant: ఎలాంటి పరిస్థితులైనా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన ఆయన.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులనూ అన్నివిధాలా సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉద్ధృతంగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని సూచించారు. ఒమిక్రాన్ విషయంలో భయాందోళన అవసరంలేదన్న సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రం బూస్టర్ డోస్ ప్రకటన దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
"ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులనూ సిద్ధం చేయాలి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉద్ధృతంగా చేయాలి. ఒమిక్రాన్ విషయంలో భయాందోళన అవసరంలేదు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కేంద్రం బూస్టర్ డోస్ ప్రకటన దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాలి"
- ఏపీ ముఖ్యమంత్రి జగన్
సాధారణ బదిలీలకు పచ్చజెండా..
వైద్యారోగ్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం పచ్చజెండా ఊపారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నాటికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.