తెలంగాణ

telangana

ETV Bharat / city

'ధాన్యం సేకరణకు దేశమంతటా ఒకే విధానం ఉండాలి..'

kcr modi
kcr modi

By

Published : Mar 23, 2022, 7:45 PM IST

Updated : Mar 23, 2022, 10:11 PM IST

19:44 March 23

ప్రధాని మోదీకి లేఖ రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR Letter to PM Modi : ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ ఒత్తిడి పెంచుతోంది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మంత్రులు, ఎంపీల బృందం ఇప్పటికే దిల్లీ చేరుకోగా... రబీలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. రబీ సీజన్​లో రాష్ట్రంలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని సేకరించాలని కోరారు.

మొత్తం ధాన్యాన్ని సేకరించకపోతే కనీస మద్ధతు ధర అన్న విషయానికి అర్థం ఉండబోదన్న సీఎం... ధాన్యాన్ని పూర్తిగా సేకరించకపోతే తెలంగాణ రైతులు, వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దాని వల్ల జాతీయ ఆహార భద్రతా లక్ష్యానికి కూడా విఘాతం కలుగుతుందని అన్నారు. జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం అవసరమని కేసీఆర్ తెలిపారు.

దేశంలో పండే అన్ని ఆహార ధాన్యాల సేకరణ కోసం దేశమంతటా ఒకే విధానం ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అభిప్రాయప్డడారు. పంజాబ్, హరియాణా లాంటి రాష్ట్రాల్లో పండే మొత్తం వరి, గోధుమలను సేకరిస్తున్న కేంద్రం... తెలంగాణలో మాత్రం అలా చేయడం లేదని ఆరోపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు వివిధ రకాల కేంద్ర విధానాలు సబబు కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం కోసం ముఖ్యమంత్రులు, వ్యవసాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రికి సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కేంద్రం రెండేళ్ల పాటు రైతుల ఆగ్రహాన్ని చవిచూసిందని లేఖలో ప్రస్తావించారు. రైతుల ఆందోళనతో చట్టాల విషయంలో కేంద్రం దిగిరాక తప్పలేదని అన్నారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు బాధ్యత ప్రధానంగా కేంద్రానిదేనని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు గిడ్డంగుల నిల్వ సామర్థ్యం, రాష్ట్రాల మధ్య సరఫరాకు అవకాశం ఉండబోదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్పులు గణనీయంగా పెరిగాయని... తద్వారా రైతుల ఆత్మహత్యలు, వలసలు బాగా తగ్గాయని లేఖలో సీఎం పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్థానిక ప్రజాపంపిణీ వ్యవస్థ అవసరాలు పోను మిగిలిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని కేసీఆర్ అన్నారు. గతంలో ఈ తరహా విధానం అమల్లో ఉన్నప్పటికీ... గడచిన రెండేళ్లుగా కేంద్రం ఈ విధానాన్ని అనుసరించడం లేదని లేఖలో ముఖ్యమంత్రి తెలిపారు. కనీస మద్దతు ధర, ఆహార భద్రతా చట్టం అమలు ప్రధాన బాధ్యత కేంద్రానిదేనన్న విషయాన్ని మరవద్దని అన్నారు.

పంటల వైవిధ్యం దిశగా రైతులను ఇప్పటికే పత్తి, ఆయిల్ పామ్, కందులు, తదితర పంటల దిశగా మళ్లించామన్న సీఎం... రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలతో రబీలో వరిసాగు 2021 లోని 52 లక్షల ఎకరాల నుంచి 2022 లో 36 లక్షల ఎకరాలకు తగ్గిందని తెలిపారు. పంటల వైవిధ్యం దిశగా ప్రయత్నిస్తూనే పండిన ధాన్యం మొత్తాన్ని ఎలాంటి ఆంక్షపలు లేకుండా కొనుగోలు చేయాల్సిందేనని కేసీఆర్ లేఖలో స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి కోరారు.

ఇదీ చదవండి :'పండిన ధాన్యం అంతా కొనలేం.. దానికి కొన్ని లెక్కలుంటాయి..'

Last Updated : Mar 23, 2022, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details