ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల వరుస పర్యటనలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. 20వ తేదీ ఉదయం ఆయన సిద్దిపేట, మధ్యాహ్నం కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్ నగర జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ల సమీకృతభవన సముదాయాలను ప్రారంభిస్తారు. సిద్దిపేటలో కొత్త పోలీసు కమిషనరేట్ భవనాన్ని, కామారెడ్డిలో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించనున్న ఎయిమ్స్ తరహా భారీ మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తారు. 22న ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రిని సందర్శిస్తారు. హైదరాబాద్‌కు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసాలమర్రిని దత్తత తీసుకుంటానని కేసీఆర్ గతంలో ప్రకటించారు.
సీఎం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని శాఖలు ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాయి. అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తారు. మిగిలిన జిల్లాల పర్యటనలు తర్వాత ఖరారవుతాయి.