THub 2 launch: ఒకేసారి నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం అయిదు గంటలకు ప్రారంభించనున్నారు. 53.65 మీటర్ల ఎత్తులో (రెండు బేస్‌మెంట్లు, 10 అంతస్తులు.. మూడు ఎకరాల్లో 3.6 లక్షల చదరవు అడుగుల్లో) నిర్మించారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, సైయింట్ వ్యవస్థాపక ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీహబ్ సీఈవో శ్రీనివాస్‌రావు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. అడోబ్ ఛైర్మన్, సీఈవో శంతనునారాయణ్, సికామోర్ నెట్‌వర్క్స్ సీఈవో దేశ్‌పాండే, అతేరా ఎండీ కన్వయ్ రేఖి, ఇతర దేశవిదేశీ ప్రముఖులు వీడియో సందేశాలు ఇస్తారు. ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ఐటీశాఖ కూయాప్‌తో...హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హీరోమోటార్స్, పొంటాక్, వెబ్3 సంస్థలతో టీహబ్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
ఉదయం నుంచే కార్యక్రమం..టీహబ్ కొత్త భవనంలో ఉదయం 9.30 నుంచే డ్రమ్ జామ్‌తో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కలారీ క్యాపిటల్‌కు చెందిన రవీందర్‌సింగ్, డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు చెన్నమనేని రోహిత్, మోఎంగేజ్ సహవ్యవస్థాపకుడు రవితేజ దొడ్డా, స్విగ్గి సహవ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి, ‘కూ’సంస్థ సహవ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణలు పాల్గొనే చర్చాగోష్ఠిలో సినీ నటుడు దగ్గుబాటి రానా కీలక ఉపన్యాసమిస్తారు.