వరిధాన్యం కొనుగోలు గురించి కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగినట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. యాసంగి పంట కొనుగోలుపై కేంద్రం నాన్చివేత ధోరణి వహిస్తోందని మండిపడ్డారు. స్పష్టమైన ప్రకటన కోసం రేపు దిల్లీ వెళ్లి తేల్చుకుంటామని స్పష్టం చేశారు. సీఎస్‌తో కలిసి అంతా దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, ఎఫ్‌సీఐని కలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఏడాదిలో ఎంత కొంటారో కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం.. మాట్లాడతామని కేంద్రం చెప్పిందన్నారు. ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
మా నీటి వాటా ఎంతో తేల్చండి!
'రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా... కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదు. తెలంగాణ నీటి వాటా ఎంతో స్పష్టం చేయాలి. ఈ విషయంలో కేంద్రం చేస్తున్న తాత్సారం తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. దీనిపై దిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని, కేంద్ర జలశక్తిశాఖ మంత్రిని కలిసి నీటి వాటా తేల్చాలని కోరతాం. కృష్ణా, గోదావరిలో నీటి వాటాలను తేల్చేందుకు వెంటనే ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి నిర్దేశిత సమయంలో తేల్చాలి. కోర్టులో కేసు కూడా ఉపసంహరించుకున్నాం. లేనిపక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మా సహనాన్ని పరీక్షించొద్దు.. తెలంగాణ ఉద్యమాల గడ్డ. నీటి వాటా తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ బాధ్యతను విస్మరించింది. దయచేసి వెంటనే తేల్చాలి.'
-కేసీఆర్, సీఎం