ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మరోమారు ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ దిశగా సోమవారం కార్యాచరణ ఖరారు చేయడంతో పాటు ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం హస్తిన పయనం కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల అంశంపై విస్తృతంగా చర్చించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబిత, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందే...
యాసంగిలో ధాన్యం సాగు, కొనుగోళ్ల అంశంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందేనన్న సీఎం కేసీఆర్... ఈ విషయంలో క్షేత్రస్థాయి నుంచి దేశ రాజధాని వరకు పోరాటం చేయాలని మంత్రులకు స్పష్టం చేశారు. వరి ధాన్యాన్ని సేకరించే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. జిల్లాల్లో చేపట్టే కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సమన్వయం చేసి విజయవంతం చేయాలని దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు కోసం సోమవారం తెరాస పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.