ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం నదీజలాల అంశంపై ఏర్పాటైన అత్యున్నత మండలి రెండో సమావేశం మంగళవారం జరగనుంది. అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. తాజాగా రెండో సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో దృశ్యమాధ్యమ విధానంలో జరగనున్న సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు కూడా దృశ్యమాధ్యమం ద్వారా సమావేశానికి హాజరవుతారు.
ఏపీ వాదనలకు దీటుగా
కృష్ణా - గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి, ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వడం, గోదావరి జలాల్లో వాటా, కృష్ణా బోర్డు తరలింపు అంశాలు అపెక్స్ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో ఉన్నాయి. వీటితో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. దానికి సంబంధిత అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. అత్యున్నత మండలి సమావేశం నేపథ్యంలో ఇప్పటికే ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... నదీజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వాదనలకు దీటుగా సమాధానం చెప్పాలని, మరోమారు తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రాకుండా వాస్తవాలను స్పష్టం చేయాలని నిర్ణయించారు.