రాష్ట్రంలో విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలి? ఏతరగతులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలి? అనే కీలక అంశాలపై.. నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో కేసీఆర్.. నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనాతో మార్చి 2020లో మూతపడిన పాఠశాలలు, కళాశాలలను క్రమక్రమంగా తెరవాలని అధికారులు భావిస్తున్నారు.
20 రోజుల పాటు పరిశీలన!
తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఈనెల 18 నుంచి ప్రత్యక్షతరగతులు ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. తొమ్మిది, పదో తరగతులు ప్రారంభించిన తర్వాత.. 15, 20 రోజులు పరిశీలిస్తారు. ప్రతికూల అంశాలు లేకపోతే 6 నుంచి ఎనిమిదో తరగతి వరకు తరగతులు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఒకటి నుంచి ఐదువరకు ప్రత్యక్షతరగతులు నిర్వహించవద్దని.. విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. పరీక్షలు లేకుండానే ఈ ఏడాది పైతరగతులకు ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు.
ఇంటర్ బోర్డు సైతం..
ప్రభుత్వం అనుమతిస్తే ఈనెల 18 లేదా 20 నుంచి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తెరవాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈనెల18 నుంచి.. మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ద్వితీయ సంవత్సరం వారికి ఉదయం, మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండో షిఫ్టు తరగతులు పెట్టాలని ప్రణాళికలు రచించింది. అలా కాకుంటే రోజు విడిచి రోజు నిర్వహించాలని.. ప్రతిపాదనల్లో సూచించింది.