రైతులు ఐక్యమైతేనే వారు పండించిన పంటకు వారే ధరను నిర్ణయిస్తారని... అందుకు రైతువేదికలను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదికను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. పల్లె ప్రకృతి వనాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి సందర్శించారు. కొడకండ్ల మార్కెట్‌యార్డులో నిర్వహించిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం... దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రైతువేదికలకు శ్రీకారం చుట్టామన్నారు.
రాజీనామాకు సిద్ధం
రాష్ట్రంలో నిర్మాణాత్మకంగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. సన్నధాన్యం విషయంలో కాంగ్రెస్, పింఛన్ల నిధుల విషయంలో భాజపా... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. రాష్ట్రంలో రూ.11 వేల కోట్లతో పింఛన్లు ఇస్తుండగా.... కేంద్రం రూ105 కోట్లు మాత్రమే ఇస్తోందన్న కేసీఆర్... తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే నిమిషంలో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. విపక్షాలు ఎంత అసత్య ప్రచారం చేసినా... దుబ్బాకలో తెరాస గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.