ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హస్తినకు చేరుకున్నారు. శాసనసభ సమావేశం, బీఏసీ భేటీలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం... ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమయ్యారు. దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు తెరాస లోక్‌సభపక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు పలువురు కేంద్ర మంత్రులతో జరిగే ముఖ్య సమావేశాల్లో పాల్గొనడం కోసం సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా దిల్లీకి చేరుకున్నారు.
ఏ ఏ సమావేశాల్లో పాల్గొంటారంటే...
శనివారం రోజు.. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తారు.
ముఖ్యమంత్రుల సమావేశంలో..
ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైనా చర్చిస్తారు. హోంశాఖ సమావేశం అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కేసీఆర్ భేటీ అవుతారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం చర్చిస్తారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
శాంతిభద్రల దృష్ట్యా...
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ (cpi) (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానుండగా.. ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే లేఖలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది.
మొన్నే దిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్..
ఈ నెల 1న కేసీఆర్ దిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో తెరాస కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం దిల్లీకి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్.. పలు కార్యక్రమాల దృష్ట్యా అక్కడే ఉండిపోయారు. 2వ తేదీన దిల్లీలో తెరాస కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భూమి పూజ అనంతరం 3న ప్రధాని మోదీ(PM NARENDRA MODI)తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు మోదీతో సమావేశమైన కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోదీని కేసీఆర్ ఆహ్వానించారు.
సంబంధిత కథనం..